Viagra Side Effects | అంగ స్తంభన సమస్య పురుషులను మనోవేదనకు గురి చేస్తుంది. దీంతో అంగస్తంభన కోసం ఎన్నో రకాల ఆహారాలను తీసుకుంటారు. ఎక్కువ సేపు అంగ స్తంభన ద్వారా ఎక్కువ లైంగిక ఆనందం పొందడం కోసం కొంతమంది విచ్చలవిడిగా వయాగ్రాలను కూడా వాడేస్తుంటారు. అందుకే, ఓ అధ్యయనం.. ‘అంగస్తంభన’ కోసం పురుషులు చేసే పనులపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో కొందరు పౌష్టికాహారం ద్వారా అంగ స్తంభ సమస్యలను అదిగమిస్తామని చెప్పగా.. ఎక్కువ మంది వయాగ్రా పైనే ఆధారపడతామని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంగస్తంభన కోసం మందులను వాడే పురుషుల డేటాను పరిశీలించిన పరిశోధకులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. 


వయాగ్రా తీసుకొనే వ్యక్తులు చూపు కోల్పోయే అవకాశం దాదాపు రెండింతలు ఉన్నట్లు US శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంగస్తంభన కోసం వివిధ మందులు తీసుకుంటున్న 213,000 మంది పురుషుల డేటాను విశ్లేషించారు. వయాగ్రా, సియాలిస్, లెవిట్రా, స్టెండ్రా అనే నాలుగు సాధారణ సెక్స్ డ్రగ్స్‌ని వారంతా ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నారు. ఈ మందులు తీవ్రమైన కంటి సమస్యలకు కారణమయ్యే ప్రమాదం 85 శాతం పెరిగింది. ఈ మందులు రెటీనాపై ప్రభావం చూపుతాయి. ఆప్టిక్ నరాలకి రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల బాధితులు దృష్టిని కోల్పోతారు.


బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ మహర్ ఎట్మినాన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మూడు రకాల కంటి సమస్యలకు వయాగ్రా మందులకు బలమైన లింక్ ఉంది. లైంగిక శక్తిని పెంచే ఈ మాత్రలు కంటికి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది చూపుపై ప్రభావం చూతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 


లైంగిక శక్తి పెంచే మందులు ఇంకా మానసికంగా లేదా శారీరకంగా కూడా ప్రభావం చూపవచ్చు. ఒత్తిడి, నిరాశ, గుండె జబ్బులు, మధుమేహంతో సహా రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే పరిస్థితులకు దారితీయొచ్చు. JAMA ఆప్తాల్మాలజీ అధ్యయనంలో భాగంగా ‘ఫాస్ఫోడీస్టేరేస్ టైప్-5 ఇన్హిబిటర్స్’ అనే ఔషధాల సమూహాన్ని పరిశీలించింది. వాటిలో వయాగ్రా, సిల్డెనాఫిల్ కూడా ఉన్నాయి. ఈ మందులు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తాయి, అయితే అవి శరీరంలోని ఇతర భాగాలలో రక్త ప్రవాహాన్ని అడ్డుకొనే ప్రమాదం ఉందని నిపుణులు తెలుసుకున్నారు.  


Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..


తాజా పరిశోధనలో లైంగిక శక్తిని పెంచే మాత్రలు తీసుకునే వారిలో ‘సీరస్ రెటీనా డిటాచ్‌మెంట్’ ప్రమాదాలు 2.6 రెట్లు పెరుగుతాయని తెలుసుకున్నారు. ఇది ‘ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి’కి దారి తీయొచ్చని పేర్కొన్నారు. ఈ ఔషదాలు వాడేవారిలో ఏమైనా దృష్టి లోపం సమస్యలు కనిపిస్తే.. బాధితులు వెంటనే వాటిని వాడటం మానేయాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి, మీకు కూడా అలాంటి మాత్రలను ఉపయోగించే అలవాటు ఉంటే వైద్యులు సలహా తీసుకోండి. 


Also Read: తిక్క జంట - ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ ఒక్కటై పెళ్లి, ఇంటి పేరే తంట!