'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా 'అంటే సుందరానికీ' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన 'దసరా' అనే మరో సినిమాలో నటిస్తున్నారు.  శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు నాని.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో 'నాటు నాటు' పాటలో సంచలన స్టెప్స్ సృష్టించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా మండు వేసవిని సైతం లెక్క చేయకుండా ఈ పాట కోసం చిత్ర యూనిట్ కష్టపడి పనిచేస్తుంది.


సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.