Coins Making Cost: రూపాయి బిళ్ల విలువ ఎంత.. అదేం పిచ్చి ప్రశ్న రూపాయి విలువ రూపాయే కదా అంటారా? అవును.. రూపాయి విలువ రూపాయే.. కానీ ఆ రూపాయి నాణెం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? భారత ప్రభుత్వం అనేక రకాల నాణేలను తయారు చేస్తుంది. రూపాయి, రెండు రూపాయలు, ఐదు, 10, 20, 150 ఇలా చాలా రకాల నాణేలను తయారు చేస్తుంది ప్రభుత్వం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఎవరైనా ప్రముఖులకు నివాళిగా ప్రత్యేక నాణేలు తయారు చేస్తారు. అయితే ఈ నాణేలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అనే ప్రశ్న మీకెప్పుడైనా వచ్చిందా? 


కరెన్సీని ఎవరు ముద్రిస్తారు?


భారతీయ కరెన్సీలో కొన్ని నోట్లు అలాగే నాణేలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొన్ని నాణేలను, నోట్లను ప్రభుత్వం ముద్రించగా, కొన్ని నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది. ఒక రూపాయి నోటు, అన్ని నాణేలు భారతీయ ప్రభుత్వమే ముద్రిస్తుంది. రూ. 2 నుంచి రూ. 500 వరకు ఉన్న నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. గతంలో ఆర్‌బీఐ రూ.2000 నోటును ముద్రించేది. అయితే ఇప్పుడు రూ.2000 నోటును వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది.


నాణేల ధర ఎంత?


నాణేల తయారీకి అయ్యే ఖర్చు గురించి మాట్లాడినట్లయితే, ప్రతి నాణేనికి వేర్వేరు ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఒక రూపాయి నాణెం ధర రూ.1.11 కాగా.. అదే రూ.2 రూ.1.28, రూ.5 నాణేలకు రూ.3.69, రూ.10 నాణేలకు రూ.5.54. ఖర్చు అవుతుంది. అయితే ఈ వివరాలు 2018 నాటివి. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వివరాలను స్వయంగా వెల్లడించింది. 


నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుంది?


నోటు ప్రింటింగ్ ఖర్చు గురించి చెప్పాలంటే, రూ. 2000 నోటు ప్రింటింగ్ ఖర్చు రూ. 4 వరకు ఉండేది. ఇది కాకుండా 10 రూపాయల 1000 నోట్లు రూ. 960, 100 రూపాయల 1000 నోట్లు రూ. 1770, 200 రూపాయల 1000 నోట్లు రూ. 2370, 500 రూపాయల 1000 నోట్లు రూ. 2290 రూపాయలు ఖర్చు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 


2000 వేల నోటు వెనక్కి తీసుకున్న ఆర్బీఐ


2000 రూపాయల నోటును చలామణీ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు గత నెల ఆర్బీఐ గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని, లేదా ఖాతాల్లో జమ చేయవచ్చని తెలిపింది. RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో సైతం రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్ఠంగా రూ. 20 వేల విలువైన నోట్లను మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. లావాదేవీల రూ. 2000 నోట్లను తీసుకుంటే, సెప్టెంబర్‌ 30లో వాటిని మార్చుకోవడమో, ఖాతాల్లో జమ చేయడమో చేయాలని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల మార్పిడి పూర్తి ఉచితం, బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించవు. రూ. 2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ రద్దు చేయలేదు, చలామణీ నుంచి ఉపసంహరించుకుంటోంది. కాబట్టి, రూ. 2000 నోటు చెల్లుబాటులోనే ఉంటుందని, లావాదేవీల కోసం ఇప్పటికీ రూ. 2000 నోట్లను తీసుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.