సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో పెంపుడు జంతువులు, కుక్కలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి. తాజాగా, అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వీధి కుక్క ఖరీదైన కారుపై స్వేచ్ఛగా నిద్రిస్తూ హల్ చల్ చేసినా సదరు కారు యజమాని ఏమీ అనలేదు. దీన్ని చూసిన నెటిజన్లు అతను కూలెస్ట్ మ్యాన్ అంటూ ప్రశంసిస్తున్నారు. 






హైదరాబాద్ కు చెందిన ఇంటిరియర్ డిజైనర్ అమీర్ శర్మ తన ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. తన కారుపై పడుకున్న వీధి కుక్కను ఏమీ అనకుండా, సైగలతో అది కిందకు దిగేలా చూశారు. దీంతో ఆ శునకం సంతోషంతో తోక ఊపుతూ కృతజ్ఞతలు తెలిపినట్లుగా సదరు వీడియోలో ఉంది. ఈ తతంగాన్ని ఆయన తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ, 'నా ఫెరారీ కార్ కవర్ చుట్టుపక్కల వీధి కుక్కలకు వెచ్చని మంచంగా పని చేస్తుంది.' అంటూ కామెంట్ చేశారు. దీన్ని ఇప్పటి వరకూ 8 లక్షల మంది వీక్షించగా, 99,679 మంది లైక్ చేశారు.


నెటిజన్ల ప్రశంసలు


ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు సదరు కారు యజమానిని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇతను కూలెస్ట్ మ్యాన్' అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా, 'జంతువుల పట్ల మీకున్న ప్రేమకు మా మద్దతు ఉంటుంది' అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. 'ఇతని నుంచి మనం కొన్ని మర్యాదలు నేర్చుకోవాలి' అంటూ మరో నెటిజన్ షేర్ చేశారు.


అయితే, ఈ కామెంట్స్ పై స్పందించిన అమీర్ శర్మ, 'నా చుట్టూ ఉన్న వాటిని మాత్రమే నేను చూసుకోగలను. ఇలాంటి గాయపడిన నిరాశ్రయానికి గురైన వీధి కుక్కలు చాలా ఉన్నాయి. కాబట్టి దయగల వారందరూ సహాయం చేయగలరు.' అంటూ రిప్లై ఇచ్చారు.