స్కిల్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. 'న్యాయానికి సంకెళ్లు' పేరిట మరో వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
చేతులకు తాడు కట్టుకొని నిరసన
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన సీఎం జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15 (ఆదివారం) రాత్రి 7 గంటల నుంచి 7:05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బన్ కట్టుకొని నిరసన తెలపాలన్నారు. న్యాయానికి 'ఇంకెన్నాళ్లీ సంకెళ్లు' అని నినదించాలని కోరారు. ఆ వీడియోలు సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
'చంద్రబాబును అంతమొందించే కుట్ర'
అంతకు ముందు వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, చంద్రబాబును జైల్లోనే ఉంచేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. 'ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉంది. చంద్రబాబుకు ఏ హాని జరిగినా, జగన్ సర్కార్, జైలు అధికారులదే బాధ్యత.' అని లోకేశ్ హెచ్చరించారు.
జైలులో దోమలు ఎక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, చన్నీళ్లు ఇస్తున్నారని, అందుకే చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. 'చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎందుకీ కక్ష.?' అని లోకేశ్ ప్రశ్నించారు.