టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదంటే ఎగతాళిగా మాట్లాడుతారా? అని మండిపడ్డారు. ఆరోగ్య సమస్యలపై వైద్యులు చెప్పాలి గానీ... డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వెల్లడించారు. " కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సదస్సులు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ పునః పంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి కూడా దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. 


తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించారన్నారు. 12 రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ లోకేష్‌కు ఒక్కరోజు కూడా హోంమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గద్దె దిగే వరకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకమవుతాయని రామకృష్ణ స్పష్టం చేశారు. 


గత నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పుచాలా ఎక్కువని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేసిన అప్పులు వేల కోట్ల వరకు ఉంటాయని చెప్పారు. జగన్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి ఆరుసార్లు వేల కోట్లు అప్పు చేసిందని రామకృష్ణ అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఏపీలో లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ప్రజలపై గుదిబండగా మారాయని రామకృష్ణ అన్నారు. 


వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి ఢిల్లీలో  ఉండగానే కృష్ణా జలాలపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా.. అప్పర్ భద్రకు అనుమతులు ఇచ్చింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో పునః పంపిణీ ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేయడానికే. సీఎం ఉత్తరం రాసి వదిలేశారు తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విశాఖ ఉక్కు ఉత్పత్తి తగ్గిస్తున్నా.. దాని మనుగడ కోల్పోయేలా చేస్తున్నా చూస్తూ ఉండిపోయారు. చేతకాని దద్దమ్మ సీఎంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని సంఘాలు పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలి. పవన్ కళ్యాణ్‌ని అభినందిస్తున్నా. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆయన తన వైఖరి చెప్పారు.’’ అని తెలిపారు.