Father’s Day 2024: అమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితం ఇస్తాడు- అంటారు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. వ్యక్తుల జీవితంలో అమ్మ పాత్రకు ఉన్న ప్రాధాన్యం.. అగ్రతాంబూలం.. వేరు. కానీ, ఇదే సమయంలో కనిపించని నాన్న పాత్ర.. కనిపెంచిన అమ్మకంటే కూడా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడతారు శేషేంద్ర శర్మ. పసి బిడ్డగా పుట్టిన నాటి నుంచి విద్యాబుద్ధులు.. నేర్పే వరకు.. నాన్న గురువుతో సమానం. బిడ్డల ఆకలి తీర్చి అమ్మ మురిసిపోతే.. అదే బిడ్డలు జీవితంలో ఉన్నతస్థాయికి చేరే వరకు.. కష్టపడి ఆయా స్థాయిల్లో వారిని చూసుకుని మురిసిపోతాడు తండ్రి. ముఖ్యంగా ఆస్తుల కన్నా చదువులు ఇవ్వాలన్న ధోరణి పెరుగుతున్న కాలంలో తండ్రుల బాధ్యతలు కూడా అంతే పెరుగుతున్నాయి. పిల్లల చదువుల కోసం.. తన కష్టార్జితాన్నే కాదు.. అవసరమైతే.. పిత్రార్జితాన్ని కూడా త్యాగం చేసే తండ్రులు ఉన్నారు. ఈ నెల 16న(జూన్‌లో వచ్చే మూడో ఆదివారం) తండ్రుల దినోత్సవం సందర్భంగా బిడ్డల జీవితంలో తండ్రుల పాత్ర కంటే.. వారి విద్యల విషయంలో తండ్రి ఎలా తపిస్తాడు..ఎలా కలలు కంటాడు.. అనే విషయాలు చర్చించుకుందాం.
ప్రతి తండ్రి(Father) జీవితంలోనూ `ఫాదర్స్ డే`కి(Father’s Day) అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది జూన్ 16(June)న ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకోనున్నారు. కుటుంబంలోనే కాదు.. సమాజంలోనూ తండ్రి పాత్రను మననం చేసుకునే ఈ రోజు ఒక ప్రత్యేకమనే చెప్పాలి. ముఖ్యంగా తమ బిడ్డలకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది తండ్రే. ఆయనను చూసే పిల్లలు పెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం తండ్రి నుంచే అబ్బుతుందని సైకాలజీ కూడా చెబుతోంది. ముఖ్యంగా చదువు విషయంలోనూ తండ్రుల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోంది. పిల్లల ఎదుగుదలలో తండ్రుల పాత్ర నేటి ప్రపంచంలో అయితే మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో బిడ్డల చదువు విషయంలో తండ్రుల పాత్రపై నేడు సమాజంలో చర్చ సాగుతోంది.
నాన్న ఎందుకు ముఖ్యం?
తల్లిదండ్రులే తమ పిల్లలకు మార్గదర్శకులు. వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. ఒక పిల్లాడు తన తల్లిదండ్రుల నుంచే మంచైనా, చెడైనా నేర్చుకుంటాడని మానసిక వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అదేవిధంగా వారి నుంచే విలువలను ఎంచుకుంటాడు. పిల్లలు తమంతట తాము మానసికంగా ఎదిగే వరకు ఎలా ఉన్నప్పటికీ.. మానసికంగా ఎదుగుదల ప్రారంభమైన తర్వాత.. మాత్రం తమ తండ్రిని వారు రోల్ మోడల్‌గా భావిస్తారు. దీంతో బిడ్దల వయసు పెరుగుతున్న కొద్దీ తండ్రికి, బిడ్డకు మధ్య భావోద్వేగ బంధం పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం, తండ్రి లేని కుటుంబాల్లో పెరిగే పిల్లలు 20 సంవత్సరాల వయస్సులోపు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటోందని తెలుస్తోంది. దీనికి కారణాలు అనేకం. అదే తండ్రి ఉన్న కుటుంబాల్లో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది.
ముఖ్యంగా చదువు విషయంలో..
బిడ్డల చదువు విషయంలో తండ్రి పాత్ర అత్యంత గణనీయం. కొన్ని కొన్ని విషయాలను పిల్లలు తమ తండ్రితో పంచుకునేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా సంక్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు... వారు నేరుగా నాన్న దగ్గర కూర్చుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిని ప్రేమించే పిల్లలు తండ్రి విషయంలోకి వచ్చేసరికి బాధ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు.. తండ్రులతో కొనసాగించే ప్రేమానుబంధాలు వారిలో ఉన్న మానసిక సమస్యలను, ఒత్తిడులను దూరం చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. విద్యోన్నతిలోనూ వారికి దోహడపడుతున్నాయి.
చాలా కుటుంబాల్లో.. సంపాయించే తండ్రులను పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. పిల్లలు కూడా ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఖర్చులు, పెట్టుబడి మొదలైన వాటిని వారు తమ తండ్రుల నుంచి నిశితంగా గమనిస్తూ నేర్చుకుంటారు. ఇక, చదువు విషయానికి వస్తే.. తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించేందుకే తండ్రులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రమశిక్షణ, విలువలు, నిజాయితీ విషయంలోనూ తండ్రి పాత్ర గణనీయం. పిల్లలు వాటిని తమ తండ్రుల నుంచే నేర్చుకుంటారు.
పిల్లల చదువులో తండ్రి ప్రేరణ ఇలా..
బిడ్డల చదువులో తండ్రి ఎలా ప్రేరణ కలిగిస్తాడనే విషయంలో 8 అంశాలు కీలకంగా ఉన్నాయి.
1. పిల్లలకు కథలు చెప్పడం.
2. కుదిరిన వేళలను పిల్లలకు కేటాయించి వారితో ఆటలు ఆడడం.
3. పిల్లల జీవితంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం. వారి కోరికలు తెలుసుకోవడం.
4. సలహాలు ఇవ్వడం, తీర్పులు చెప్పకుండా.. వారి తప్పులను సరిచేయడం.
5. పిల్లల అభిరుచులను తెలుసుకోవడం. చదువుతో పాటు వాటిని కూడా ప్రోత్సహించడం
6. తప్పు-ఒప్పుల మధ్య బేధాలను వివరించడం.
7. పిల్లల పట్ల ఆప్యాయంగా ఉండడం. వారిలోనూ పెరిగేలా చేయడం.
8. పిల్లలు నిజాతీయ పరులుగా ఉండేలా, దయకలిగి ఉండేలా.. ఇతరులపట్ల గౌరవంగా ఉండేలా ప్రోత్సహించడం.
ఏంటీ ఫాదర్స్ డే!
ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం జరుపుకొంటారు. యూరోపియన్ దేశాలలో ఈ రోజు పబ్లిక్ సెలవు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని సంస్కృతులలో ఏదో ఒక రూపంలో ఈ రోజును ఘనంగా జరుపుకొంటారు. సిక్కులు గురుగోవింద్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 29న ఫాదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీ. క్యాథలిక్ దేశాలు ఫాదర్స్ డేని మార్చి 19న సెయింట్ జోసెఫ్స్ డేగా పాటించారు. `ఫాదర్స్ డే` ఆచారం పశ్చిమ దేశాలలో ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ రోజున పిల్లలు తమ తండ్రులకు గ్రీటింగ్ కార్డ్‌లు ఇవ్వడం.. వారితో కలిసి ముచ్చట్లు పంచుకోవడం.. ద్వారా తమ తండ్రిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకుంటారు. అమెరికాలో మొదటి ఫాదర్స్ డే జూన్ 19, 1910న జరుపుకొన్నట్టు తెలుస్తోంది.