Gender Change Operation: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆమె నుంచి అతడిగా మారాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలంగా ఆమెలో పురుషుడికి సంబంధించిన హార్మోన్లు ఉన్నాయని, పురుషుడిలాగానే జీవించాలనుకుంటున్నానని తెలిపారు. కానీ సమాజం ఏం అనుకుంటుందోనని భయపడి ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని సుచేతన వివరించారు. ఇప్పుడు మాత్రం తాను లింగ మార్పిడి చికిత్స చేయించుకొని సుచేతన్ గా మారబోతున్నట్లు ప్రకటించారు.
"నేను వయసులో చాలా పెద్దవ్యక్తిని. నా వయసు 41 సంవత్సరాలు. నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. ఈ శరీరంలోని మార్పులు నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దు. నేను ముందునుంచి మానసికంగా పురుషుడిలాగే ఉన్నాను. ఇప్పుడు శారీరకంగా కూడా పురుషుడిలా మారాలనుకుంటున్నాను. నా గురించి చిన్నప్పటి నుంచి నా తండ్రికి తెలుసు కాబట్టి.. లింగ మార్పిడి చికిత్సకు ఆయన ఆశీస్సులు ఉంటాయి." - సుచేతన
లింగమార్పిడి చికిత్స చేయించుకుంటానని చెప్పినప్పటి నుంచి తనకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయని సుచేతన వివరించారు. అయితే వాటన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యం తనకు ఉందని, ఎవరు ఏం చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. అలాగే ఈ వార్తలను వక్రీకరించవద్దని మీడియాను కోరారు. ఇది తన సొంత పోరాటం అని.. తాను ఒంటరిగానే పోరాడాలనుకుంటున్నట్లు వివరించారు. అన్ని విషయాల్లోలాగా ఈవిషయంలోనూ ఆలస్యం చేయడం మంచిది కాదని... తెలిపారు. అలాగే తాను లింగమార్పిడి చేసుకోబోతున్నట్లు తెలిసి చాలా మంది మద్దతు ఇవ్వగా.. మరికొంత మంది ఆశ్యర్యపోయినట్లు వివరించారు.