నాసా డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం విజయవంతం
డైమోర్ఫస్ ఆస్టరాయిడ్ ను ఢీకొట్టిన డార్ట్
ఉదయం 4.44 గంటలకు డైమోర్ఫస్ పై క్రాష్
ప్రయోగమంతా లైవ్ ఇచ్చిన డ్రాకో కెమెరా
ఆస్టరాయిడ్ ను ఢీకొట్టే ప్రయోగం ఇదే తొలిసారి
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి గమనించిన అబ్జర్వేటరీలు
అబ్జర్వేటరీల డేటా ఆధారంగా ప్రయోగంపై మరింత సమాచారం
నాసా ప్రయోగించిన ఓ స్పేస్ క్రాఫ్ట్ కొన్ని లక్షల మైళ్ల దూరం ప్రయాణించి ఓ ఆస్టరాయిడ్ ను లాగిపెట్టి ఒక తన్ను తన్నింది. ఆస్ట్రరాయిడ్ ఏంటీ.. లాగి తన్నటం ఏంటీ అనుకుంటున్నారా. అర్థం చేసుకోవటానికి అలా అనుకోవచ్చు కానీ అసలు ఏం జరిగిందంటే... ప్లానెటరీ డిఫెన్స్ మెకానిజం ను డెవలప్ చేసుకోవటంలో భాగంగా నాసా ప్రయోగించిన డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ -DART స్పేస్ క్రాఫ్ట్.. డైమోర్ఫోస్ అనే ఆస్టరాయిడ్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రయోగాన్ని నాసా- డార్ట్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే...ఆస్టరాయిడ్ ఢీకొట్టే ప్రక్రియను అంతా డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ కు అమర్చిన డ్రాకో కెమెరా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రేమికులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4.44 గంటలకు డార్ట్ స్పేస్ క్రాఫ్ట్...డైమోర్ఫోస్ ఆస్టరాయిడ్ ను ఢీకొట్టి దానిపై క్రాష్ అయ్యింది.
అసలెందుకు ఈ ప్రయోగం :
NASA కోసం జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. భూమికి దాదాపు 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో డైమోర్ఫస్ A,B అనే జంట ఆస్టరాయిడ్ లను నాసా డార్ట్ గుర్తించింది. దీని వల్ల భూమికి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా కేవలం ప్రయోగం కోసం ఈ ఆస్టరాయిడ్ లను డార్ట్ ఎంచుకుంది. ఏదైనా గ్రహశకలం కానీ లేదా ఏదైనా ఖగోళ వస్తువులు కానీ తరచుగా భూమి పక్కనుంచి వెళ్తుంటాయి. ఒకవేళ భూమిని అవి ఢీకొంటే ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే మన శాస్త్రవేత్తలు ముందుగా భూమి వైపునకు దూసుకొచ్చే ఖగోళ వస్తువులను దారి మళ్లించే టెక్నాలజీని డెవలప్ చేశారు. అదే డార్ట్ మిషన్.భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం రావచ్చని ముందే గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఈ అంతరిక్ష నౌకను రూపొందించారు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టడం మూలంగానే డైనోసార్లు అంతరించిపోయాయని పరిశోధకులు చెప్తుంటారు. అలాంటి ముప్పు నుంచి భూమిని కాపాడేందుకే నాసా DART అంతరిక్ష నౌకను రూపొందించింది.
DART ఎలా పని చేస్తుంది :
భూమిని చేరుకోవడానికి అవకాశం ఉన్న ఆస్టరాయిడ్ ల వైపు DART స్పేస్‌క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది. దాని చుట్టూ చిన్న ఉపగ్రహాన్ని మోహరిస్తుంది. టార్గెట్ చేసిన గ్రహశకలం చుట్టూ తిరుగుతుంది. సమాచారాన్ని సేకరిస్తుంది. డేటా, చిత్రాలను సేకరించిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ఆస్టరాయిడ్‌లోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత గ్రహశకలాన్ని బ్లాస్ట్ చేస్తుంది. ఫలితంగా దాని రూట్ ను మార్చటమే లేదా అక్కడే కూలిపోయేలా చేయమటమో చేయవచ్చు. ఇప్పుడు డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ డైమోర్ఫస్ మీద చేసిందందే. సరిగ్గా పాయింట్ ను చేసుకుని దాన్ని బలంగా ఢీకొట్టింది.
ఆస్టరాయిడ్ కక్ష్య మారిందా లేదా..?
ఇది తెలిసేందుకు కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ ఆస్టరాయిడ్ పై క్రాష్ అయ్యే వరకూ విజువల్స్ లైవ్ లో వచ్చాయి. క్రాష్ అయిన తర్వాత ఆస్టరాయిడ్ గతిలో ఏమన్నా మార్పు వచ్చిందా తెలియాలంటే స్పేస్ టెలిస్కోప్ ల డేటా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక స్పేస్ టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు నాసా డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగాన్ని రికార్డు చేశారు. ఫలితంగా గతంలో డైమోర్ఫోస్ ఆస్టరాయిడ్ ఉన్న ప్రాంతం...స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయిన తర్వాత అది పయనిస్తున్న దిశ, ప్రాంతం బట్టి ఈ ప్రయోగం ఫలితాలు తెలుస్తాయి. అయితే సుదూర ప్రాంతంలోని ఓ ఆస్టరాయిడ్ ను అది తిరుగుతున్న ప్రాంతాన్ని ఐడింటిఫై చేసి సరిగ్గా దాన్ని టార్గెట్ చేసి దానిపై ఓ స్పేస్ క్రాఫ్ట్ కూలిపోయేలా చేయటం అనేది మానవ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఇదే తొలిసారి. కనుక ఈ ప్రయోగంలో ఇప్పటికే 99 శాతం మేర ఫలితాలను సాధించినేట్లనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పేస్ టెలిస్కోపుల నుంచి ఫలితాలు కూడా వస్తే భవిష్యత్తులో చేపట్టే ఈ ప్రయోగాలపై ఓ దశ దిశ ఖరారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.