దేవుడి మీద భక్తిని చాటుకునేందుకు కొందరు  చేసే పనులు ఎంతో వింతగా అనిపిస్తాయి. కొందరు భక్తిని నిరూపించుకునేందుకు నిప్పులు మీద నడుస్తారు. మరికొంత మంది శూలాలతో గుచ్చుకుంటారు. కొంత మంది ఒంటికాలి మీద ఏండ్ల తరబడి నిలబడి ధ్యానం చేస్తారు. ఇంకొంత మంది ఒంటి కాలితో నడుస్తూ భగవంతుడి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. తాగా మరో సాధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యం కలిగించింది.

   


వాస్తవానికి ఎవరైనా చేతిని పైకెత్తితే ఎంత సేపు ఉంచుతారు? ఐదు, పది నిమిషాలు ఉంచగలుగుతారు. కానీ, ఓసాధువు మాత్రం  ఎత్తిన చెయ్యిని దించకుండా ఏండ్ల తరబడి ఉంటున్నాడు. నమ్మడానికి వింతగా ఉన్నా ముమ్మాటికీ వాస్తవం. అవును.. అమర్‌ భర్తీ అనే 70 ఏళ్ల సాధువు.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు కొంత కాలం క్రితం బాగా వైరల్ అయ్యింది.  1973 వరకు అమర్‌ భర్తీ ఒక సాధారణ వ్యక్తే అయినా.. ఆ తర్వాత భక్తిమార్గంలోకి అడుగు పెట్టాడు. తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలి అనుకున్నాడు. అప్పటి నుంచి తన చేతిని పైకి ఉంచి భక్తిని చాటుకున్నాడు. సుమారు అర్థ శతాబ్దంపాటు తన చేయి అలాగే ఉంచాడు. 2020లో ఈయన గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.   


తాజాగా మరో సాధువు ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. దశాబ్ద కాలంగా ఎత్తిన చెయ్యి దించకుండా ఉంటున్నారు మహంత్ రాధేపురి జునా అఖారా. అలహాబాద్‌ కు చెందిన ఓ దేవుడిపై భక్తితో 10 సంవత్సరాలకు పైగా తన కుడి చేతిని పైకి ఎత్తి పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా అతడి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.  తన దేవుడి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నానని, అందుకే  తన కుడి చేతిని పైకి ఎత్తి ఉంచుతున్నట్లు చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇలాగే ఉంచుతున్నట్లు తెలిపారు.





 అమర్‌ భర్తీని సైతం మహంత్ రాధేపురి జునా అఖారా గుర్తు చేసుకున్నారు. ఆయనలా  50 ఏండ్ల రికార్డును బద్దలుకొట్టలేకపోవచ్చు. కానీ,  తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని ఆయన వెల్లడించారు.  గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని ఇంకా ఎంత కాలం ఇలాగే ఉంచుతానో చెప్పలేనని తెలిపారు. 10 ఏండ్లుగా ఒంటి చేస్తోనే అన్ని పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు చేతిని పైకే ఎత్తి ఉంచుతానని వెల్లడించారు. చేతిని పైకి ఉంచడం మూలంగా తనకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని చెప్పారు మహంత్ రాధేపురి జునా అఖారా. అయితే, చాలా ఏళ్లుగా ఆ చేతిని అలాగే ఎత్తి ఉంచడం వల్ల కండరాలు కూడా పట్టేసి ఉంటాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో అతను చేయి దించాలన్నా కష్టమేనని, రక్త ప్రసరణ సక్రమంగా లేకపోతే ఆ చేయి చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.