సినిమాల్లో చూపించే స్టంట్స్ తరహాలో.. ఓ కారు వేగంగా వంతెన మీద జంప్ చేసింది. రెప్పపాటులో అంత ఎత్తు నుంచి కిందపడింది. ఈ భయానక ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఆ రోజు జోరుగా వాన కురుస్తోంది. ఆండ్రూ వోవ్లెస్ అనే 35 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలు డనిల్లే అండ్రుస్‌(28)తో కలిసి కారులో వెళ్తున్నాడు. సౌత్ వేల్స్‌లోని కారీటన్ ఇంటర్‌ఛెంజ్ రోడ్డు వద్దకు చేరగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. సెకన్ల వ్యవధిలో అది వంతెన రైలింగ్‌ను ఢీకొట్టి రోడ్డు మీదకు దూసుకెళ్లింది. దీంతో కారు గాల్లో ఎగురుతూ.. చెట్టను ఢీకొడుతూ తలకిందులుగా కిందపడింది. ఈ ఘటనలో డనిల్లే అక్కడికక్కడే చనిపోయింది. ఆండ్రూ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 


అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 3.43 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజాము కావడం వల్ల ఆ మార్గంలో ఇతర వాహనాలేవీ లేవు. దీంతో అతడు కారును వేగంగా డ్రైవ్ చేశాడు. సరిగ్గా చిన్న రోడ్డు నుంచి హైవేలోకి వెళ్ళే మార్గంలోకి టర్న్ తిరగడానికి బదులు.. కారును నేరుగా పోనిచ్చాడు. దీంతో ఆ కారు వంతెనకు అడ్డంగా ప్రయాణిస్తూ.. రైలింగ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్లను ఢీకొట్టి.. గిరగిరా తిరుగుతూ కిందపడింది. 


ప్రమాదం సమయంలో ఆండ్రూ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. సుమారు 100 కిమీల వేగంతో ప్రయాణిస్తూ వంతెన రైలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో 72 అడుగుల ఎత్తు నుంచి కారు పడిపోయింది. చెట్లను ఢీకొట్టడం వల్ల కారు వేగంగా 65 కిమీ వరకు తగ్గింది. కానీ, బోల్తాపడటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఆండ్రూ రక్త నమూనాల్లో డ్రగ్స్ స్థాయి మొతాదుకు మించి ఉన్నట్లు తేలింది. దీంతో డ్రగ్స్ తీసుకుని నిర్లక్ష్యంగా కారు నడిపాడనే కారణంతో కోర్టు అతడికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. 


ప్రమాద వీడియోను ఇక్కడ చూడండి: