Bengaluru Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ లో వాహనాలు నడపుతూ కొన్నిసార్లు నరకం అనుభవిస్తారు వాహనదారులు. ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా గంటల సమయంలో పడుతుంది. సిగ్నలింగ్ పని చేయకపోయినా, రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా, వర్షం కురిసినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి సమయంలో ఆ రూట్లో వెళ్లే వారికి పట్టపగలే చుక్కలు కనిపిస్తుంటాయి. చాలా మంది హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ సమస్యలని చాలా మంది భయపడిపోతుంటారు. అంతలా రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. అయితే హైదరాబాద్ కు తాత లాంటిది బెంగళూరు. బెంగళూరు నగర ట్రాఫిక్ తో పోలిస్తే.. హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ చాలా తక్కువ. అంత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుండి బెంగళూరు రోడ్లపై.
హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా.. ట్రాఫిక్ ఉన్న రోడ్లపై నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమ్యస్థానం చేరడానికే వాహనదారులు ప్రయత్నిస్తుంటారు. చిన్న సందు దొరికినా సర్రున దూసుకెళ్తుంటారు. లేకపోతే వెనక ఉన్న వారు వచ్చి ఎక్కడ మనల్ని దాటుకుని ముందుకు వెళ్తుంటారా అనుకుంటారు. ఇవి ఈ రెండు మెట్రో నగరాల రోడ్లపై వాహనదారులు చాలా సాధారణంగా చేసే విన్యాసాలే. కొన్నిసార్లు అయితే రాంగ్ రూట్ లో వెళ్లి మరీ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ ట్రిక్స్ అన్ని సార్లు వర్కవుట్ అవుతాయన్న గ్యారెంటీ ఏమీ లేదు. కొన్ని సార్లు బెడిసి కొడతాయి. ఒక్కోసారి అడ్డంగా ట్రాఫిక్ పోలీసులకు, సీసీ కెమెరాలకు చిక్కుతారు. అప్పుడు పెద్దగానే వాత పెట్టించుకుంటారు కూడా. అలాంటి ఓ సాధారణ ట్రిక్ చేసి ట్రాఫిక్ నుంచి బయటపడదామని బెంగళూరులో ఓ వాహనదారుడు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఆ సంఘటనను మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వైరల్ అవుతున్న వీడియోను చూసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల ఆ వాహదారుడికి జరిమానా గట్టిగానే వడ్డించారు.
బెంగళూరులోని ఓ ఇరుకైన రోడ్డులో ఎడమ వైపు వాహనాలన్నీ ఆగిపోయాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు మాత్రం వాహనాలేవీ లేవు. అంతలోనే ఆ దారిలోకి కారుతో వచ్చిన ఓ వాహనదారుడు.. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలని భావించి.. రైట్ సైడ్ రోడ్డులోకి దూసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లగానే అటు నుంచి ఓ స్కూల్ వ్యాన్ ఎదురుగా వచ్చింది. ఇక చేసేదేమీ లేక.. కారును రివర్స్ లో తీసుకువచ్చాడు. ఇదంతా అదే రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. చాలా వరకు ట్రాఫిక్ జామ్‌లు ఇలాంటి వారి వల్లే అవుతాయని, రోడ్డుపై వేచి ఉన్న వాళ్లంతా మూర్ఖులని ఫీల్ అవుతారంటూ.. బెంగళూరు అని క్యాప్షన్ ఇచ్చి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. అది బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు చేరింది. ఆ వీడియోలో కనిపించి సదరు కారు రిజిస్టర్ నంబరు ఆధారంగా ఆ డ్రైవర్ ను గుర్తించారు. అలాగే రాంగ్ రూట్ లో వాహనం నడిపినందుకు అతడికి జరిమానా కూడా విధించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.