సినీ పరిశ్రమలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. క్రేజ్, హిట్స్ ఉన్నంతవరకే హీరోయిన్స్‌కు వెంటవెంటనే ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఒక్క ఫ్లాప్ పడినా కూడా వారి కెరీర్ ఎలా టర్న్ అవుతుంది అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. అందుకే ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోయిన నటీమణులు కూడా ఇప్పుడు ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు తాము డ్యూయెట్‌లు పడిన హీరోలకే తల్లులుగా నటించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. తాజాగా త్రిష కూడా ఒక యంగ్ హీరోకు తల్లిగా చేస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కొంతకాలంగా తమిళంలోనే బిజీ అయిపోయిన త్రిష.. తల్లి పాత్రతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.


త్రిష ఫ్యూచర్ ప్రాజెక్ట్స్


త్రిష సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యి రెండు దశాబ్దాలు అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా భారీ రెమ్యునరేషన్‌తో కెరీర్‌ను కొనసాగిస్తోంది. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పీఎస్’ ఫ్రాంచైజ్‌లో కుందవైగా త్రిష చేసిన మరోసారి తన కెరీర్‌కు కొత్త బూస్ట్‌ను అందించింది. ప్రస్తుతం త్రిష చేతిలో లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమా ఉంది. ఇందులో విజయ్‌కు జోడీగా త్రిష కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగడంతో పాటు 2023 అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక చాలాకాలం తర్వాత తెలుగులోకి త్రిష రీఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. అది కూడా యంగ్ హీరో శర్వానంద్‌కు తల్లి పాత్రలో కనిపించనుందని రూమర్స్ అంటున్నాయి.


ప్రస్తుతం కోలీవుడ్‌లోనే త్రిష బిజీగా ఉంది. తెలుగు తెరపై తను కనిపించి చాలాకాలం అయ్యింది. ఇక త్వరలోనే తెలుగు ఫ్యాన్స్‌ను పలకరించడానికి త్రిష సిద్దమవుతుందని సమాచారం. అది కూడా చిరంజీవితో జతకడుతుందని టాక్. ఇంతకు ముందు చిరంజీవి, త్రిష కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడంతో పాటు ఈ పెయిర్ కూడా ఫ్రెష్‌గా అనిపించింది అంటూ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. కానీ స్టాలిన్ విడుదలయ్యి పదేళ్లపైనే అవుతుంది. ఇక ఇన్నాళ్ల తర్వాత చిరు, త్రిష కలిసి జతకట్టడం అనేది ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. అది కూడా వీరిద్దరు ఒక మలయాళ చిత్ర రీమేక్‌లో కనిపించనున్నారట.


శర్వానంద్‌కు తల్లిగా..


మలయాళంలో మోహన్‌లాల్, పృథ్విరాజ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘బ్రో డాడీ’ను తెలుగు రీమేక్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారు. దీనికోసం కళ్యాణ్ కృష్ణను దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడీగా మీనా నటించింది. వీరిద్దరి కొడుకి పాత్రలో పృథ్విరాజ్ కనిపించాడు. అయితే తెలుగులో ఇదే పాత్రలలో చిరంజీవి, త్రిష, శర్వానంద్ కనిపించనున్నారని సమాచారం. అంటే శర్వానంద్‌కు తల్లిగా త్రిష కనిపించనుందని అర్థం. ఇంతకు ముందు ఈ పాత్ర కోసం సిద్ధు జొన్నలగడ్డను అనుకున్నారు కానీ సిద్ధు ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు టాక్. ఇక ఇందులో శర్వానంద్‌కు జోడీగా శ్రీలీల జంటగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.


Also Read: సైమా అవార్డ్స్‌-2023 నామినేషన్స్ లిస్ట్ - 11 కేటగిరీల్లో ‘RRR’, 10 విభాగాల్లో ‘సీతారామం’ పోటీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial