దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే SIIMA అవార్డుల వేడుకకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ ఏటి మేటి సినిమాలకు సెప్టెంబర్ 2వ వారంలో దుబాయ్ వేదికగా ఈ అవార్డులను అందజేయనున్నారు. తాజాగా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌-2023 కోసం పోటీపడే సినిమాల లిస్టు రిలీజ్ అయ్యింది. తెలుగులో ప్రతిష్టాత్మక ‘RRR’ చిత్రం ఏకంగా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుని సత్తా చాటింది. కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘కాంతార’, ‘KGF 2’ కూడా 11 విభాగాల్లో నామినేషన్స్ పొందాయి.  ‘సీతారామం’, ‘పొన్నియిన్ సెల్వన్-1’ చిత్రాలు 10 విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకున్నాయి.  


తెలుగులో నామినేషన్స్ పొందిన చిత్రాలు


టాలీవుడ్ కు సంబంధించి బెస్ట్ మూవీ విభాగంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘RRR’తో పాటు సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘DJ టిల్లు’, నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘కార్తికేయ-2’, అడవి శేష్ మూవీ ‘మేజర్’, దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’ చిత్రాలు బరిలో నిలిచాయి.






తమిళంలో నామినేషన్స్ దక్కించుకున్న మూవీస్


తమిళంలో మణిరత్నం చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్-1’, కమల్ హాసన్  ‘విక్రమ్’, ‘లవ్ టుడే’, ‘తిరుచిత్రంబలం’,  ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రాలు  బెస్ట్ మూవీ అవార్డు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో ‘పొన్నియిన్ సెల్వన్ -1’ 10 కేటగిరీల్లో పోటీ పడుతుండగా, ‘విక్రమ్’ మూవీ 9 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది.  


కన్నడలో నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు






ఇక శాండల్‌ వుడ్ లో ‘కాంతార’, ‘కేజీయఫ్‌-2’, ‘777 చార్లీ’, ‘లవ్ మాక్‌టెయిల్ 2’, ‘విక్రాంత్ రోనా’ చిత్రాలు ఉత్తమ కన్నడ చలనచిత్ర అవార్డు 2023 కోసం పోటీ పడుతున్నాయి. రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్‌ హిట్ ‘కాంతార’, యశ్‌ యాక్షన్‌ మూవీ ‘కేజీయఫ్‌-2’ చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. 


మలయాళంలో నామినేషన్స్ దక్కించుకున్న చిత్రాలు






మలయాళంలో ఈసారి 6 చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్‌ నీరద్‌ దర్శకత్వంలో మమ్ముట్టి  నటించిన ‘భీష్మ పర్వం’ చిత్రానికి 8 నామినేషన్స్‌ రాగా, టోవినో థామస్‌ ‘థల్లుమాల’ మూవీకి  7 నామినేషన్స్‌ వచ్చాయి. ‘భీష్మ పర్వం’, ‘తల్లుమాల’, ‘హృదయం’, ‘జయ జయ జయ హే’, ‘జన గణ మన’తో పాటు  ‘న్నా తాన్ కేస్ కొడుకు’ చిత్రాలు ఉత్తమ మలయాళ చిత్రం అవార్డ్ 2023 కోసం పోటీ పడుతున్నాయి.






దుబాయ్ లో SIIMA అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు


SIIMA 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15,  16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.  


Read Also: పవన్‌కు ఎంత ఇచ్చామనేది చెప్పను, అంబటివి ఆరోపణలు మాత్రమే - 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial