Auto Driver Innovative Thought For Startup: మనలో చాలామంది కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావమో, ఆర్థిక సహకారం అందకపోవడం వల్లో తమ లక్ష్యాలను చేరుకోలేరు. కానీ, కొంతమంది పట్టువదలని విక్రమార్కుడిలా తమ కలలు నెరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. తమకు దొరికిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని సైతం వదులుకోరు. అవకాశాలను అంది పుచ్చుకోవడమే కాకుండా పరిస్థితులను బట్టి అవకాశాలను సృష్టించుకుంటారు. అలాంటి కోవకే చెందుతారు బెంగుళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్. ఓ స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్న అతనికి నిధుల సమీకరణ సవాల్‌గా మారింది. ఈ క్రమంలో నిధుల సేకరణకు వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

Continues below advertisement


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శామ్యూల్ క్రిస్టీ అనే యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. స్టార్టప్ నెలకొల్పాలనేది అతని కల. ఈ క్రమంలో నిధుల సేకరణ కోసం వినూత్నంగా ఆలోచించాడు. తన ఆశయం గురించి వివరిస్తూ ఓ నోటులో వివరించాడు. దీన్ని ఆటోలో తన సీటు వెనుక ప్రయాణికులకు కనిపించేలా పెట్టాడు. 'హాయ్ ప్యాసింజర్. నా పేరు శామ్యూల్ క్రిస్టీ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అయితే.. నా స్టార్టప్ బిజినెస్ ఐడియా కోసం నిధులు సేకరించాలనుకుంటున్నా. మీకు దీనిపై ఆసక్తి ఉంటే నాతో చర్చించండి.' అంటూ అందులో పేర్కొన్నాడు. దీన్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్ ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'వావ్.. నిజంగా అతను చాలా గ్రేట్. తన ఆశయం, కల సాకారం కోసం గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు.' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'అతని ఆలోచన బాగుంది. అలాగే తన బిజినెస్ ఐడియా కూడా బాగుంటుందని అనిపిస్తోంది.' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


Also Read: Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !