Fan Create Pushpa 2 Poster Art: ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 క్రేజ్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. విడుదలకు వారం రోజుల ముందే హడావుడి మొదలైంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు, ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్‌కు ఉన్న క్రేజే వేరు. పలువురు అభిమానులు ఎన్నో విధాలుగా ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు.
తాజాగా, ఓ దివ్యాంగ అభిమాని అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పుష్పరాజ్ (Pushparaj) స్టైల్‌లో ఐకాన్ స్టార్ (Icon Star) బొమ్మను తన కాళ్లతో అద్భుతంగా ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'అల్లు అర్జున్ సార్.. దయచేసి నా కళను చూడండి. మీకోసం పుష్ప బొమ్మను గీశాను. మిమ్మల్ని కలవాలని ఉంది సార్. ఇట్లు ధీరజ్ సాత్విల్కర్.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
స్పందించిన ఐకాన్ స్టార్
ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించారు. తనపై చూపిన అభిమానానికి ఫిదా అయ్యారు. 'నా గుండెను టచ్ చేశావ్' అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ధీరజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అటు, బన్నీ ఫ్యాన్స్ సహా నెటిజన్లు సైతం అతని కళకు ఫిదా అయ్యారు. సూపర్ ఆర్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.