South Korean Came To India For her Love: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. ఇలా ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ.. ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపితమైంది. ఖండాంతరాలు, దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. దీన్ని మరోసారి నిరూపించారు భారత్ అబ్బాయి, దక్షిణ కొరియా అమ్మాయి. 


వివరాల్లోకి వెళితే..... ప్రేమించిన యువకుడ్ని పెళ్లి చేసుకునేందుకు దక్షిణ కొరియా నుంచి భారత్ వచ్చింది కిమ్ బోహ్ ని అనే యువతి. అనంతరం ఉత్తర ప్రదేశ్ కు చెందిన సుఖ్జిత్ సింగ్ను పెళ్లాడింది. పంజాబీ సంప్రదాయాల ప్రకారం గురుద్వారాలో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. షాజహాన్పుర్ జిల్లా పువాయం పరిధిలోని ఉడ్నా గ్రామానికి చెందిన సుఖ్జిత్ సింగ్.. నాలుగేళ్ల క్రితం ఉద్యోగం కోసం దక్షిణ కొరియా వెళ్లాడు.


అక్కడ ఓ కాఫీ షాప్లో పనికి కుదిరాడు. కిమ్ బోహ్ ని కూడా అక్కడే పనిచేసేది. మొదట్లో స్నేహితులుగా మెలిగిన వీరిద్దరు.. క్రమంగా ప్రేమికులుగా మారారు. దక్షిణ కొరియాలో కేవలం ఆరు నెలల పాటే పనిచేసిన సుఖ్జిత్.. తిరిగి భారత్కు వచ్చాడు. అయినా.. కిమ్ బోహ్ నితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. సుఖ్జిత్ సింగ్ పెళ్లి చేసుకుందామని భావించిన కిమ్.. నెలన్నర క్రితం మూడు నెలల టూరిస్ట్ వీసాపై భారత్ కు వచ్చింది.


అనంతరం సుఖ్జిత్ ఇంటికి చేరి.. రెండు రోజుల క్రితం అతడ్ని పెళ్లి చేసుకుంది. భారతీయ సంప్రదాయాలంటే ఎంతో ఇష్టమని చెబుతోంది కిమ్ బోహ్ ని. తన మూడు నెలల వీసా గడువు ముగిసిన తరువాత సుఖ్జిత్ సింగ్తో కలిసి తిరిగి దక్షిణ కొరియా వెళ్తానని ఆమె తెలిపింది. విదేశీ యువతిని కోడలిగా పొందటంపై సుఖ్జిత్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


(Photo: Twitter/@im_omprakashh)


ఇటీవల భారత్ లో వెరైటీ ప్రేమ కథలు... 
భారత్ , పాకిస్థాన్ శత్రుదేశాలు. అయినప్పటికీ ఇరు దేశ పౌరుల మధ్య జరుగుతున్న లవ్ స్టోరీలు  హాట్ టాపిక్ గా మారాయి. ఫేస్ బుక్ పరిచయాలు పరిణయాలకు దారి తీస్తున్నాయి.   కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ ఇళ్లు వదిలేసి ప్రియుడిని వెతుక్కుంటూ ఇండియా వచ్చేసింది.
ఎట్ట కేలకు యుపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త ఇరు దేశాల్లో సంచలన వార్తగా మారింది.


అతనిది ఏపీలోని చిత్తూరు జిల్లా. ఆమెది శ్రీలంక. ఫేస్ బుక్లో మొదలైన పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లకు అది స్నేహం కాదు ప్రేమ అని అర్థమైంది. అంతే ప్రియుడితో కలిసి బతకాలన్న ఆశతో సదరు యువతి చిత్తూరులోని ప్రియుడి ఇంటికి చేరుకుంది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియుడిని పెళ్లి చేసుకుంది. 


భారత్ కు చెందిన అంజు పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. అంజు కు రాజస్థాన్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అంజుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాతో సోషల్ మీడియాలో పరిచయమైన అంజు ప్రేమలో పడింది. నస్రుల్లాను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. పాకిస్థాన్, భారత పౌరుల మధ్య ప్రేమలు కొత్తేం కాదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చోటు చేసుకున్న ప్రేమ కథలు ఆసక్తికరంగా మారాయి.


గుంటూరు అబ్బాయి.. టర్కీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గుంటూరుకు చెందిన మధు సంకీర్త్, టర్కీ అమ్మాయి గిజెమ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఈ ఏడాది జూలైలో టర్కీలో ఈ జంట  పెళ్లిచేసుకున్నారు.


అమెరికా అమ్మాయి.. తెలంగాణ కుర్రాడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. మరి వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. విధి నిర్వహణలో పరిచయమైన ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్లిపీటలెక్కారు.  నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని గోవిందుపేట గ్రామానికి చెందిన ఆకాష్‌, అమెరికా కు చెందిన అలెక్స్‌ ఓల్సా ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెద్దలను ఒప్పంచి ఆర్మూర్‌లో కల్యాణవేడుకతో ఒక్కటయ్యారు. ఎల్లలు దాటిన ఈ ప్రేమజంటను ఆశీర్వదించడానికి అమెరికా నుండి వధువు తరఫు బంధువులు తరలివచ్చారు.