Lovers Suicide In Tirupati District: తెలిసీ తెలియని వయసులో ప్రేమ అంటూ యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో పరువు హత్యలు జరుగుతుండగా.. తమను ఎక్కడ వేరు చేస్తారోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో ఇలాంటి విషాద ఘటన వెలుగు చూసింది.  తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోనున్న అటవీ ప్రాంతంలో ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చౌడేపల్లె జోగి కొత్త ఇండ్లు చెందిన యుగంధర్, రామసముద్రం మండలం చిట్టే వారి పల్లికి చెందిన బోడి కల్యాణిగా గుర్తించారు. 


ఎర్రవారిపాలెం ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. చౌడేపల్లె జోగి కొత్త ఇండ్లు చెందిన యుగంధర్ (17), రామసముద్రం మండలం చిట్టే వారి పల్లికి చెందిన బోడి కల్యాణి (15) పుంగనూరులోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారింది. యుగంధర్, కల్యాణి వీరు కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మైనర్లు కావడంతో తల్లిదండ్రులు వీరిని బుద్ధిగా చదువుకోవాలని నచ్చజెప్పారు. జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లిగురించి ఆలోచించవచ్చని హితవు పలికారు. 


తల్లిదండ్రుల మాటలను పట్టించుకోని యుగంధర్, కల్యాణి ఈ నెల 18 తేదీ రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరుపతి- పీలేరు రహదారిలో భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య (Lovers Suicide In Tirupati District) చేసుకున్నారు. ఆదివారం పశువుల మేతకు వెళ్లిన పశువుల కాపరి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.


హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెట్టు నుంచి కిందకు దించి పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి, యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇంచార్జ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు మైనర్లు కావడం విశేషం. బాలిక మెడలో పసుపు కొమ్ము తాడు కనిపించింది. ఆత్మహత్యకు ముందు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని, కానీ తల్లిదండ్రులు వీరి దూరం చేస్తారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.