Cobra Coiled Around Sivalingam In Srisailam: శివుని విగ్రహం ముందు ఆవు నంది రూపంలో కూర్చోవడం, కొన్ని ఆలయాల్లో విగ్రహాలు నీళ్లు, పాలు తాగడం వంటి వింత ఘటనలు మనం చాలా చూశాం. తాజాగా, అలాంటి ఘటనే కర్నూలు జిల్లా శ్రీశైలంలో (Srisailam) జరిగింది. శైవక్షేత్రంలో నాగుపాము హల్ చల్ చేసింది. శ్రీశైలం పాతాళగంగ రోడ్డు మార్గం వజ్రమ్మ గంగమ్మ వెనుక గల శివలింగానికి చుట్టుకుని ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ నెల 15న ఆలయానికి వెళ్లిన భక్తులు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలియడంతో భక్తులు ఒక్కసారిగా ఆలయానికి తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. శివునికి ఇష్టమైన సోమవారం రోజున స్వామికి ఆభరణంగా ఉండే పాము ఇలా శివలింగాన్ని చుట్టుకోవడం దైవ మహిమే అని భక్తులు విశ్వసిస్తున్నారు. 






నంది రూపంలో ఆవు


అటు, అనంతపురం (Anantapuram) జిల్లాలోనూ సోమవారం వింత ఘటన చోటు చేసుకుంది. పురాతన ఆలయంలో ఓ ఆవు గర్భగుడిలో శివయ్యకు ఎదురుగా నంది రూపంలో కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచింది. విడపనకల్లు మండలం గ్రామంలోని పురాతన శ్రీరామలింగేశ్వర ఆలయంలో సోమవారం ఉదయం యథావిధిగా శివయ్యను అభిషేకించి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. పూజ అనంతరం గ్రామంలోని ఒక ఆవు నేరుగా ఆలయం వద్దకు చేరుకుంది. భక్తులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా వచ్చి నంది రూపంలో కూర్చుంది. దీంతో అర్చకులు, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతోనే ఈ ఆవు ఇలా వచ్చి స్వామివారిని దర్శించుకుందని పేర్కొన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


అలాగే, అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణలోని శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతున్నారని ప్రచారం సాగింది. దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. అటు, విశాఖలోని సింహాద్రిపురం విజయలక్ష్మి ఇంట్లోనూ వారాహి అమ్మవారి విగ్రహం నీళ్లు తాగుతున్నారంటూ సాగిన ప్రచారం వైరల్ అయ్యింది. ఇది అమ్మవారి మహిమే అని స్థానికులు పేర్కొన్నారు.


Also Read: Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన