Couple Forceful Death In Nizamabad: నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన నవ దంపతులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ పోలీసులకు వీడియో పంపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ (Pothangal) మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వారు కుటుంబంతో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు. సోమవారం ఉదయం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ బయటకు వచ్చారు.


చనిపోతున్నామంటూ వీడియో


బంధువులు తమపై చేసిన దుష్ప్రచారం వల్లే మనస్తాపంతో ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. శైలజ ఓ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్ కుమార్‌కు ఓ వీడియో పంపించారు. 'గతంలో నేను ఓ తప్పు చేశాను. ఆ తప్పును నా భర్త, అత్తమామలు క్షమించారు. ఏనాడూ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. కానీ మా పిన్ని ఈ విషయాన్ని మా బంధువుల్లో చాలామందికి చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని మేము చెప్పినా బందువులతో పాటు ఇతరులకూ చెబుతోంది. ఆమె మాటలు విన్న బంధువులు ఏదేదో మాట్లాడితే నా భర్త ఇటీవలే పురుగుల మందు తాగాడు. అయినా ఈ దుష్ప్రచారం ఆగడం లేదు. అందుకే మేం చనిపోతున్నాం. మా పిన్ని వల్లే చనిపోతున్నాం.' అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.


రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా..


ఈ వీడియోపై స్పందించిన కోటగిరి ఎస్సై సందీప్.. వీడియోతో పాటు సెల్ ఫోన్ నెంబరును నవీపేట ఎస్సైకి పంపించారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక బాసర వంతెన వద్ద గాలించారు. అక్కడ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫోన్ నెంబరను ట్రాక్ చేశారు. ఈ క్రమంలో ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి గాలించగా పట్టాలపై విగతజీవులుగా కనిపించారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆన్ లైన్ బెట్టింగ్స్‌కు రైల్వే ఉద్యోగి


అటు, జనగామ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగులకు పాల్పడి ఆర్ధిక ఇబ్బందులతో ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన దేవర రాజు (38) రైల్వే ఉద్యోగి. ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని స్టేషన్‌కు కొద్దిదూరంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..


మరోవైపు, వరంగల్‌లో ఓ ఆటో డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వసంతాపూర్ గ్రామానికి చెందిన రాళ్లపల్లి అయిలయ్య (55) కొంతకాలంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఇంటి వద్దే ఉంటుండగా.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన అయిలయ్య సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరించారు.