'నాకు దుమ్ము అంటే అలర్జీ. ఇల్లు దులిపినా, కాస్త ట్రాపిక్‌లో తిరిగినా అయిపోయానే. వెంటనే జలుబు, దగ్గు వచ్చేస్తాయి'... 'నాకు కొన్ని వాసనలు పడవు. వాటి స్మెల్ చూసానంటే ఆగకుండా తుమ్ములు వస్తూనే ఉంటాయి' ఇలాంటి మాటలను మనం వింటూ ఉంటాం. మరి ఎప్పుడైనా నీళ్లతో అలర్జీ మాట విన్నారా? యూకేకు చెందిన 23 ఏళ్ల తాను ఈ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది. తనకు సహాయం చేయమని అడుగుతోంది. దీంతో ఈ అరుదైన వ్యాధి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏంటా వ్యాధి? 



మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా దైనందిక కార్యక్రమాలలో నీటిని ఉపయోగిస్తాం. నీరు లేకపోతే ఒక్క పని కూడా ముందుకు కదలదు. మానవాళి మనుగడ అంతా నీటిపై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నీటితోనే అలర్జీ వస్తే? అవును మీరు విన్నది కరెక్టే. మన రోజువారీ జీవితంలో భాగమైన నీటిని ముట్టుకున్నా లేదా అదే మన శరీరం మీద పడినా వెంటనే దురదలు, మంట, పొక్కులు రావడాన్ని ఆక్వాజెనిక్ ప్రూరైటిస్ (Aquagenic Pruritus) అంటారు. మన భాషలో చెప్పాలంటే నీటి అలర్జీ. ఈ వ్యాధి ఉన్న వారు నీటిలో తడిస్తే చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. 



యూకేకు చెందిన 23 ఏళ్ల నియా సెల్వే ఆక్వాజెనిక్ ప్రూరైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని వల్ల ఆమె నీటిని ముట్టుకున్నా, స్నానం చేసినా, వర్షపు నీటిలో తడిచినా శరీరం అంతా దురద, పొక్కులు, మంట వంటివి వస్తాయి. ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను నియా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. 





నీరు లేకుండా రోజువారీ కార్యకలాపాలు జరగడం కుదరదు. అలాంటి సందర్భాల్లో తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో కూడా వీటిలో వివరిస్తోంది. స్నానం చేసేటప్పుడు తన శరీరం ఎలా రియాక్ట్ అవుతుందనే విషయాలను పంచుకుంది. వర్షం, చెమట, కన్నీళ్లు, మూత్రం వంటి ఏ ద్రవ పదార్థం అయినా తనకు అలర్జీని కలిగిస్తోందని చెబుతోంది. తాను పుట్టినప్పుడు ఈ సమస్య లేదని.. టీనేజ్ నుంచి ప్రారంభమైందని, ఇప్పుడు మరింత ఎక్కువైందని తెలిపింది. 5 నుంచి 10 నిమిషాల పాటు తన శరీరానికి నీరు తగిలితే.. ఆ ప్రాంతంలో నొప్పి దాదాపు మూడు గంటల వరకు ఉంటుందని పేర్కొంది. 


ఈ వ్యాధికి సంబంధించి నియా జర్మనీలోని ఒక ప్రైవేటు మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటోంది. ఈ చికిత్సకు 2,50,000 పౌండ్లు (సుమారు రూ.2,57,90,362) ఖర్చు అవుతుంది. ఈ డబ్బును సేకరించడానికి గోఫండ్‌మీ పేజ్‌ ద్వారా సాయం అడుగుతోంది.



ఈ వ్యాధికి కారణాలేంటి? 
ఆక్వాజెనిక్ ప్రూరైటిస్ అనేది జన్యుపరంగా వచ్చే వ్యాధి. కొన్ని సందర్భాల్లో ఇది పాలిసైథెమియా వేరా (polycythemia vera) లక్షణంగా కనిపిస్తుంది. మైలోప్రొలిఫెరేటివ్ నియోప్లాజమ్స్ లేదా మైలోడిస్‌ప్లాస్టిక్ సిండ్రోమ్స్, హైపెరియోసినోఫిలిక్ సిండ్రోమ్, జువెనైల్ క్శాంతోగ్రానులోమా వంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో లాక్టోస్ తక్కువైనా, హైపటైటిస్ సి వంటివి కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు. 


చికిత్స ఉందా? 
ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. బేబీ ఆయిల్స్ శరీరానికి పట్టించడం, ఉపయోగించే నీటిలో సోడియం బైకార్బొనేట్ వేసుకోవడం, పెయిన్ తగ్గించుకోడానికి అనెజీసెక్స్ వాడటం, టోపికల్ కాప్సైసిన్ క్రీమ్ వాడటం వంటివి చేయవచ్చు. దీర్ఘకాలం పాటు చికిత్స తీసుకుంటే దీని నుంచి బయట పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 


Also Read: SMA: ఒక్క ఇంజెక్షన్ వెల 16 కోట్లు.. ఏంటా వ్యాధి? ఎందుకంత ధర?