టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన మన అథ్లెట్లకు పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంస్థలు నజరానాల మీద నజరానాలు, ఉద్యోగాలు ప్రకటిస్తున్నాయి. మరోపక్క మనకు క్రికెట్లో ప్రపంచకప్ అందించిన ఓ క్రికెటర్ మాత్రం రోజు గడవడం కోసం కూరగాయలు అమ్ముతున్నాడు. అంతేకాదు రోజువారీ కూలీ పనులకు వెళ్తూ గడుపుతున్నాడు. 


అదేంటీ... మన దేశంలో క్రికెటర్లు అంటే విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు కదా. ఒక్క IPLలో చోటు దక్కించుకున్నా చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని అనుకుంటున్నారా? ఇంతకీ రోజు గడవడానికి కష్టపడుతోన్న ఆ క్రికెటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


గుజరాత్‌లోని నవ్సారీకి చెందిన నరేశ్ తుమ్డా 2018లో అంధుల క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఫైనల్ దాయాదీ దేశం పాకిస్థాన్ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యాన్ని చేధించి భారత జట్టు ప్రపంచకప్ అందుకుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో సభ్యుడు నరేశ్. 2018 మార్చి 20న షార్జా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రపంచకప్ గెలిచి మూడేళ్లు దాటింది.


కరోనా సమయంలో రోజు గడవడానికే నరేశ్ కుటుంబం విలవిలలాడిపోయేది. దీంతో అతడు ప్రతి రోజూ కూరగాయలు అమ్మేవాడు. అంతేకాదు దినసరి కూలీగానూ పని చేశాడు. గత ఏడాది నరేశ్ ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశాడు. కానీ, అతడికి జాబ్ దొరకలేదు. నరేశ్ గురించి తెలిసిన పలువురు నెటిజన్లు అతడి కోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 


ముఖ్యమంత్రిని అడిగినా ప్రయోజనం లేదు
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ... ప్రస్తుతం రోజుకి రూ.250 సంపాదిస్తున్నాను. ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి మూడు స్లారు ఉద్యోగం అడిగాను. ఒక్కసారి కూడా జవాబు రాలేదు’ అని అన్నాడు. 







‘భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిస్తే ప్రభుత్వం, కార్పొరేషన్లు ఆ క్రికెటర్లపై కనక వర్షం కురిపించేవి. మేం అంధులం కావడమే మా తప్పు. అందుకే మమ్మల్ని ఎవరూ గుర్తించడం లేదు. ముందు సమాజంలో మార్పు రావాలి. వాళ్లని మమ్మల్ని ఒకేలా చూడాలి’ అంటూ నరేశ్ తన ఆవేదనను వెళ్లబుచ్చాడు. ‘ప్రపంచకప్ గెలిచినప్పుడు ఇక కష్టాలు తీరినట్లేనని అనుకున్నాను. భారత్ వెళ్లగానే ఆర్థిక సాయం అందుతుంది. దీంతో కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అని కలలు కన్నాను. కానీ, విధి వేరేలా అనుకుంది’ అని వాపోయాడు నరేశ్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాడు.