దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఆ సంస్థలపై సీసీఐ జరుపుతున్న విచారణను నిలిపివేసేందుకు సుప్రీం నిరాకరించింది. యాంటీ కాంపిటీటీవ్ ప్రాక్టీస్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీల మీద ప్రాథమిక విచారణ జరపాలంటూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ దిగ్గజ సంస్థలు తమతంట తామే విచారణకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. ఇందుకోసం ఆ రెండు కంపెనీలకు నాలుగు వారాల గడువు ఇచ్చారు.
ఏంటి కేసు..?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని భారత్‌లోని వ్యాపార సంస్థలు చేసిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిగణనలోకి తీసుకుంది. గతేడాది జనవరిలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొట్టిపారేశాయి. సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. ఇ-కామర్స్ సంస్థల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. సీసీఐ విచారణను నిలిపివేయాలన్న సంస్థల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.