తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది.  ఈ అంశంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒకటో తేదీన ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ గత బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక ఏ పార్టీకి వ్యూహకర్తగా పని చేయడం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీతో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ పార్టీలో ప్రత్యక్షంగా చేరి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ ..షర్మిల పార్టీ కోసం పని చేస్తారా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అయితే పీకే నేరుగా తమ పార్టీకి పని చేయకపోయినా ఆయన సంస్థ  ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ "ఐ ప్యాక్" సేవలు అందిస్తుందని.. వైఎస్ఆర్‌టీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. 


పీకేకు చెందిన "ఐ ప్యాక్‌"తో వైఎస్ఆర్ టీపీ చర్చలు..!


ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ అనే సంస్థను మొదటగా స్థాపించి రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్ట్ సేవలు అందించడం ప్రారంభించారు. మొదటగా ఆయన బీజేపీకే పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ , వైఎస్ఆర్ సీపీ, డీఎంకే, ఆర్జేడీ, టీఎంసీ ఇలా పలు పార్టీలకు సేవలు అందించారు. ఐ ప్యాక్ ఒప్పందం చేసుకుంటే ప్రత్యక్షంగా ప్రశాంత్ కిషోర్ టీమ్‌ను లీడ్ చేసేవారు. మధ్యలో ఓ సారి ఆయన బీహార్‌లోని జేడీయూలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో  ఐ ప్యాక్ బాధ్యతల్ని తన టీమ్‌కు అప్పగించి తాను రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్‌ను తన వారసుడిగా కూడా ప్రకటించారు. కానీ ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు పీకే. తర్వాత బయటకు వచ్చి మళ్లీ వ్యూహకర్త పనులు చేశారు. మొదటగా టీఎంసీకి తర్వాత డీఎంకేకు పని చేశారు. ఆ రెండు పార్టీలకు విజయం చేకూర్చి పెట్టిన తర్వాత ఆయనపై రాజకీయ పార్టీలకు మరింత గురి కుదిరింది.


అనుకున్నంతగా హైప్ రాలేదని షర్మిల భావన..!


ఇప్పుడు ఆయన ఒప్పుకుంటే అనేక పార్టీలు ఎంత ఖర్చు అయినా సరే భరించి స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. పార్టీ ప్రారంభించిన నాడు ఉన్న హైప్ ఇప్పుడు లేదని షర్మిల టీం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పీకే నేరుగా పని చేయడానికి అంగీకరించే పరిస్థితి లేదు. ఆయన సంస్థ ఐ ప్యాక్‌ మాత్రం సేవలు అందిస్తుంది. వైఎస్ఆర్ టీపీ పార్టీ అధినేత షర్మిలకు ప్రస్తుతం రాజకీయ పరంగా దిశానిర్దేశం చేసే మంచి స్ట్రాటజిస్ట్ అవసరం ఉంది. గతంలో పీకే టీంలో పని చేసిన ప్రియ అనే తమిళ యువతిని ప్రస్తుతానికి తమ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా నియమించుకున్నారు. అయితే నేరుగా ఐ ప్యాక్ తోనే ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఐ ప్యాక్ ఒప్పుకుంటే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీకి సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.


పీకే సేవల కోసం ఇతర పార్టీల ప్రయత్నాలు..! 


పార్టీకి పీకే సేవలు అందిస్తారని వైఎస్ షర్మిల పలు మార్లు తమ పార్టీ నేతలకు చెప్పారు. కానీ ఆయన నేరుగా సేవలు అందించే పరిస్థితి లేదు. అందుకే ఐ ప్యాక్‌ ఆ బాధ్యతలు తీసుకునేలా చర్చలు జరుపుతున్నారు. విశేషం ఏమిటంటే.. పీకే టీంతో  టీఆర్ఎస్ కూడా చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పీకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే.. తెలంగాణ కాంగ్రెస్ కోసం ఆయన పనిచేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు  పీకే వ్యూహాల కోసం ప్రయత్నిస్తున్నట్లేనని చెప్పుకోవచ్చు.