YSRTP Complaint: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నాయకులు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఒక మహిళపై అంతటి దారుణమైన భాష వాడుతూ దుర్బాషలాడారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సునీతా లక్ష్మా రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. 


'దీక్షలు చేస్తుంటే అనుచిత వ్యాఖ్యలా'


తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం పోరాడుతూ.. వారి కోసం నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేస్తుంటే.. మంత్రి కేటీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ టీపీ నాయకులు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ మంగళవారం వ్రతాలు అంటూ సంబోధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలు నిష్టగా చేసుకునే వ్రతాలను దీక్షకు ముడి పెట్టి వ్రతాలను చులకన చేశారని వైఎస్సార్ టీపీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అటు షర్మిలకు, ఇటు యావత్ మహిళా లోకానికి తీవ్ర అవమానకరం అని వారు అన్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను మంగళవారం మరదలు అని అన్నారని పేర్కొన్నారు. మహిళలను చులకన భావంతో చూసే మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


పాదయాత్రలో టీఆర్ఎస్ నాయకులపై విమర్శనాస్త్రాలు


మరో వైపు వైఎస్ షర్మిల రాజకీయ వ్యూహాలు రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా నియోజవర్గాలకు వెళ్తున్న షర్మిల... స్థానిక ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. షర్మిల విమర్శల పర్వం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రం మొదలైన రోజు నుండి ఆమె అధికార పార్టీ మంత్రులు, నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. 


తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల..!


ఆ మధ్య షర్మిలపై విమర్శలు చేస్తూ.. మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం మరదలు అని అనడంపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నిరంజన్ రెడ్డిని కుక్క అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేని దద్దమ్మలని తిట్టిపోశారు. ఇక నిరంజన్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు మధ్య సవాళ్ల పర్వం కూడా కొనసాగింది. ఈ వ్యవహారం దుమారం రేపింది. వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఆ తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల.. ఆయనపై కబ్జాల ఆరోపణలో విరుచుకుపడ్డారు. లిక్కర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీలకు చేసింది సున్నా అంటూ విమర్శలు చేశారు. పాలమూరు వర్సిటీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఫుడ్ ఇండస్ట్రీయల్ పార్క లేదని.. భూములు మాత్రం ఏడికాడికి కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఐటీ ఇండస్ట్రీయల్ పార్కు కోసం కేటాయించిన 480 ఎకరాల భూమిలో 100 ఎకరాలను ఎమ్మెల్యే కబ్జా చేశారని విమర్శించారు.