Fake Currency: అక్కకు, తమ్ముడు, అన్నకు చెల్లి సాయంగా నిలుస్తూ.. వ్యాపారం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా మిగతా వాళ్లు వారి తప్పును సరిదిద్ది సరైన మార్గంలో నడిచేలా చేయడం వంటివి కూడా చూసే ఉంటాం. కానీ ఈ అక్కా, తమ్ముళ్లు మాత్రం కలిసి దొంగనోట్లు తయారు చేశారు. ఆటో మొబైల్ షాప్ పేరుతో 2, 5 వేల నోట్లు తయారీ చేసి జనాల్లోకి చేరేలా చేశారు. అయితే సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసుస్టేషన్ లో.. ఓ వీధి వ్యాపారి తరచుగా దొంగనోట్లు వస్తున్నాయని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా బండ్లగూడలోని కాళీ మందిర్ సమీపంలో దొంగనోట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 


ఆటోమొబైల్ షార్ నిర్వహిస్తున్న కస్తూరి రమేష్ బాబు, ఆయన అక్క రామేశ్వరి కలిసి ఈ పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు వెళ్లగా రమేష్ బాబు దొరికాడు. అక్క పరమేశ్వరి తప్పించుకొని పారిపోయింది. అయితే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు రమేష్ బాబుతో పాటు దొంగ నోట్ల తయారీ కోసం ఉపయోగించిన ప్రింటర్, కరెన్సీకి కావాల్సిన పేపర్, ప్రింట్ చేయిన 3,16000 రూపాయల విలువ చేసే దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు లెనోవా లాప్ టాప్, బ్లాండ్ అండ్ వైట్ ప్రింటర్, స్క్రీన్ ప్రింటింగ్ మిషిన్, ఒక మొబైల్ ఫోన్, టాటా ఇండికా కారును నార్త్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు రామేశ్వరి కోసం గాలిస్తున్నారు. 


 జగిత్యాలలో కూడా ఇలాంటి ఘటనే.. 
జగిత్యాల జిల్లా కేంద్రంలో నాలుగు నెలల క్రితం దొంగ నోట్ల కలకలం చెలరేగింది. భారీ ఎత్తున నకిలీ నోట్లను మార్పిడికి ప్రయత్నించిన ఓ ముఠాని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన మేక శేఖర్ అనే వ్యక్తి గతంలో దొంగనోట్ల చలామణిలో అరెస్టై జైలుకు కూడా వెళ్లివచ్చాడు. 2003 నుంచి ఈ దందాను నడిపిస్తున్న శేఖర్ పై మహారాష్ట్రలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో జైలు జీవితం అనుభవించాడు. మళ్లీ అదే దందాలోకి దిగడానికి తన మిత్రులైన రాధాకిషన్ అనే వ్యక్తిని పురికొల్పాడు. దీంతో రాధా కిషన్ గోదావరిఖనికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గౌడ్, హనుమకొండకు చెందిన విజ్జగిరి భిక్షపతితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి భిక్షపతికి వరసకు సోదరుడైన విజ్జగిరి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా సదరు దొంగనోట్లను మార్చడానికి ఓ పార్టీని సంప్రదించడానికి ప్రయత్నించారు.


శ్రీకాంత్ కూడా సరైన పార్టీ దొరికే వరకు వేచి చూసి ఏకంగా దాదాపు 15 లక్షల రూపాయల విలువైన దొంగనోట్లు కావాలి అని చెప్పాడు. దీంతో శేఖర్ రాధాకిషన్, శ్రీనివాస్ గౌడ్ ముగ్గురూ కలిసి లక్సెట్టిపేట నుంచి బయలుదేరిరాగా భిక్షపతి, శ్రీకాంత్ ఇద్దరు కలిసి జగిత్యాలలోని న్యూ బస్టాండ్ వద్దకి వరంగల్ నుంచి చేరుకొని మార్పిడి కోసం ప్రయత్నించారు. దీనికై దాదాపు మూడు లక్షల రూపాయలను సిద్ధంగా ఉంచుకుని ఉదయం 9 గంటలకు టైం ఫిక్స్ చేసుకున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే నోట్లను పకడ్బందీగా మోసం చేస్తూ కీలకమైన పండుగల సమయంలో లేదా ఇతర జాతరలు జరిగే సమయంలో అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని వేసిన పథకాన్ని జగిత్యాల పోలీసులు ముందస్తు సమాచారంతో బట్ట బయలు చేయగలిగారు.