వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ఫ్యామిలీని లక్ష్యంగా చేస్తూ మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈసారి మంత్రి కేటీఆర్‌పై ఘాటుగా స్పందించారు. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, విచ్ఛిన్నకర కర శక్తుల్ని తిప్పికొట్టాలని దొర చెప్తూ ఉంటారని అన్నారు. ఆ విచ్ఛిన్నకర శక్తులు మీరే కదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం పేరుతో వేల ఎకరాలు కాజేశారని ఆరోపించారు. నీళ్లు, నిధులను సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారని, మొత్తానికి బందిపోట్ల రాష్ట్ర సమితి రాష్ట్రం మొత్తాన్ని దోచేసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం (సెప్టెంబరు 11) ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
‘‘దొంగే దొంగా దొంగా అన్నట్లుంది మంత్రి కేటీఆర్ తీరు. విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర గారు.. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా. బంగారు తునకపై 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరే. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి లక్ష కోట్లు కాజేసిన శక్తులు మీరే. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగులను, పొట్టన పెట్టుకున్న అతీత శక్తులు మీరే. రాష్ట్రం పేరు చెప్పి వేల ఎకరాలు కాజేసిన భూ బకాసుర శక్తి మీరే. తెలంగాణ నినాదాన్ని వక్రీకరించి, నీళ్లను ఫామ్ హౌజ్ కి పారించి, నిధులను సొంత అవసరాలకు తరలించి, నియామకాలను కుటుంబానికే ఇచ్చుకున్న బంది పోట్ల రాష్ట్ర సమితినే ఈ రాష్ట్రానికి విచ్ఛిన్నకర శక్తి. ప్రజల సొమ్ముతో స్వార్థ రాజకీయలు చేస్తూ, ఉజ్వల తెలంగాణ చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించి, ఉద్యమ కారులను అణగదొక్కి, తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులు’’ అని వైఎస్ షర్మిల ఎక్స్‌లో పోస్ట్ చేశారు.