వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన ఓటమికి భయపడే కామారెడ్డి నుంచి కూడా పోటీకి రెడీ అయ్యారంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుండడంపై స్పందించారు. సీఎంపై సెటైర్లు వేశారు.
గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను తన్ని తరిమేస్తారని ఆయనకు అర్థం అయినట్లు ఉందని వైఎస్ షర్మిల అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం ఇదని అన్నారు. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండని ఎద్దేవా చేశారు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాలు విసిరారు.
‘‘గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థం అయినట్టుంది. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం. దొర గారు ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు.. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు.. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే.. దళిత బంధు అందకపాయే.. ఇక దొర గజ్వేల్ లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే.. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాల్ చేస్తున్నాం’’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడు చోట్లే అభ్యర్థులను మర్చినట్టు కేసీఆర్ తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వైరా, కోరుట్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఏడుగురిని మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఎక్కువ మార్పులు ఉండవని చెప్పినట్లు కేసీఆర్ గుర్తుచేశారు.
వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు నిరాశ ఎదురైంది. హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికి ఇచ్చారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహా రావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. పౌరసత్వం సమస్య ఉన్న కారణంగా వేములవాడలో చెన్నమనేని రమేష్ స్థానంలో వేరే లీడర్‌కు చల్మెడ లక్ష్మీ నరసింహా చోటు కల్పించారు.