"నేను మీ రాజన్న బిడ్డను, జగనన్న వదిలిన బాణాన్ని.."


వైయస్​ షర్మిల చెప్పిన ఈ మాటలు  ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోయాయి.. వైసీపీ జెండా మోసే సామాన్య కార్యకర్తకు నూతన ఉత్సాహాన్నిచ్చాయి. ఇప్పుడు తెలంగాణ గడ్డపైన ఆమెకు కొత్త పార్టీ పెట్టేంత ధైర్యాన్నిచ్చాయి. అసలు ఎక్కడినుంచి వచ్చింది ఈ ధైర్యం..?


అడుగేసింది అంతే..


2012, మే 27.. వైయస్​ జగన్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్​లో పలు స్థానాల్లో ఉపఎన్నికలు జరిగే సమయం అది. పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం. అప్పుడు పడింది వైయస్​ షర్మిల ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు.


అన్న లేని లోటు తెలియకుండా.. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు తానే సారథిగా నిలిచారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. అదే మరో ప్రజాప్రస్థానం.


అన్న లేని వేళ అన్నీ తానై..


'నాయకుడు లేని సేన నిలువలేదు' అనే మాట మనం వింటూ ఉంటాం. జగన్​ అరెస్ట్​ అయిన సమయంలో షర్మిల లేకుంటే వైసీపీ పరిస్థితి కూడా అలానే అయి ఉండేది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. 


సుదీర్ఘ పాదయాత్రలో షర్మిల దాదాపు 150కి పైగా జనసభలలో ప్రసంగించారు. ఓ వైపు పాదయాత్ర ప్రభంజనం అయితే.. మరోవైపు ఆమె ప్రసంగం ప్రవాహంలా జనంలోకి సాగింది.


పాదయాత్ర విశేషాలు..



  1. 14 జిల్లాల మీదుగా 9 నెలలకుపైగా సాగిన పాదయాత్ర 

  2. 116 నియాజకవర్గాల ప్రజలను కలుసుకుంటూ సాగిన యాత్ర

  3. 2250 గ్రామాలను తాకుతూ షర్మిల మరో ప్రజాప్రస్థానం

  4. మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండ నిర్వహణ

  5. 152 ప్రదేశాలలో జనసభలలో ప్రసంగం

  6. ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికిపైగా జనాలను షర్మిల ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా 


తెలంగాణలో 'ఆమె'..


రాజన్న బిడ్డగా మొదలైన షర్మిల రాజకీయ జీవితం.. ఇప్పడు తెలంగాణలో నూతన శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతుంది. మరి తెలంగాణలో ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందో చూడాలి.