Telangana CM Revanth Reddy: హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని రెండు రోజుల కాంగ్రెస్ లో విలీనం చేస్తూ వైఎస్ షర్మిల (YS Sharmila) హస్తం గూటికి చేరారు. అయితే షర్మిలను ఎన్నికల ముందు తెలంగాణ నేతలు పదే పదే అన్నమాట నువ్వు ఏపీకి చెందిన వ్యక్తివి. కావాలంటే మీ సోదరుడు జగన్ అరాచక పాలనపై పోరాటం చేసి, ఏపీలో రాజన్న రాజ్యం తేవాలని సూచించే వారు. ఇంతకీ ఆమె ఏపీ నాయకురాలా, తెలంగాణ నాయకురాలా అనే ప్రశ్న తలెత్తింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తమ పార్టీకి చెందిన షర్మిలను ఏపీ నాయకురాలు, ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని పేర్కొన్నారు. అధిష్టానం తనకు ఏమైనా హింట్ ఇచ్చిందో లేదో కానీ.. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు సైతం ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్.. షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అని సంభోదించారు. తెలంగాణకు ఎన్నికలకు ముందు సైతం షర్మిల ఏపీలో రాజకీయాలు చేసుకోవడం బెటర్ అని పలుమార్లు రేవంత్ అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినా ఏపీలో పార్టీ కోసం పనిచేస్తే ఫలితం ఉంటుందనేవారు. తాజాగా సైతం షర్మిలను ఏపీకి చెందిన నాయకురాలు, ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు నేతల్లోనూ చర్చకు దారితీశాయి. రాజన్న బిడ్డగా, గతంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకురాలిగా షర్మిలకు పేరుంది. కనుక ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారుతుందా, ఇంతకీ షర్మిల ఎంట్రీతో రాష్ట్రంలో ఏ పార్టీపై ప్రభావం పడుతుందా అనేది హాట్ టాపిక్.
రేవంత్ ఎందుకలా అన్నారంటే!
తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాక సైతం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్సార్ కు ప్రాణమని, జీవితాంతం ఇందులోనే కొనసాగారని షర్మిల చెబుతుంటేవారు. కానీ రేవంత్ రెడ్డి లాంటి నేతలు దొంగలు అని, ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి ముఖ్యమంత్రి అవకూడదంటూ ఘాటుగా విమర్శించడం సైతం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కారణమని చెప్పవచ్చు. తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే షర్మిల ఏపీకి పరిమితం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఆమె జోక్యం ఉండదని, అందుకే రేవంత్.. షర్మిలను ఏపీ నాయకురాలు అని ఆ ప్రాంతానికి పరిమితం కావాలని ఆకాంక్షిస్తున్నారని అర్థమవుతోంది. పైగా తనతో భేటీ అయిన కొన్ని గంటల్లోనే షర్మిలపై రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహ వేడుకలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు.
కొన్ని రోజుల కిందట వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఓట్లు చీలతాయని ఆమెను చర్చించి, కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేయడంలో సక్సెస్ అయింది. అదే సమయంలో పార్టీని సొంతంగా నడపడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, వైఎస్సార్ జీవితాంతం సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో కొనసాగాలని షర్మిల భావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని పదే పదే చర్చ జరిగినా అప్పుడు సాధ్యం కాలేదు. రెండు రోజుల కిందట షర్మిల ఢిల్లీ వేదికగా ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకీ షర్మిల కాంగ్రెస్ లో చేరారు, కానీ ఆమె ఏపీ కాంగ్రెస్ నాయకురాలా, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలా అనే చర్చ పార్టీలో సైతం మొదలైంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని రేవంత్ వ్యాఖ్యానించడం గమనిస్తే.. ఆమె ఏపీలోనే రాజకీయాలు చేసుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ వరకే ఆమె పరిమితమై ఆ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని తన మనసులో మాటను మరోసారి చెప్పకనే చెప్పేశారు. అధిష్టానం అభిప్రాయం ఏంటనేది త్వరలోనే తేలనుంది.