Kolusu Parthasarathy Meets Chandrababu: పెనమలూరు: కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం జరగనుంది. వైసీపీకి మరో ఎమ్మెల్యే షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన పెనమలూరు  ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కొలుసు పార్థ సారథి టీడీపీలో చేరనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పెనమలూరు కు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్థసారథి హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో జగన్ మనిషి అని భావించే పార్థసారథి తెలుగు దేశం పార్టీలో చేరిక దాదాపు ఖరారు అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఒకట్రెండు రోజుల్లో లేకపోతే కొన్ని రోజుల్లోనే పార్థ సారథి పసుపు కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే జగన్ విపక్షం లో ఉన్నప్పుడు అంటిపెట్టుకుని ఉన్న వారిలో ఒకరు పార్థ సారథి. కానీ జగన్ అధికారంలో ఉండగా ఎందుకు వైదొలుగుతున్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


తన సొంత స్థలంలో వైసీపీ పార్టీ ఆఫీస్ నడిపిన నేత
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వైసీపీ, జనసేన లాంటి ప్రధాన పార్టీలు అన్నీ ఏపీలోనే హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఆ సమయంలో విపక్షం లో ఉన్న వైసీపీకి పార్టీ ఆఫీస్ లేకపోవడంతో విజయవాడ నడిబొడ్డున ఉన్న తన స్థలం లోనే పార్టీ ఆఫీస్  ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో పాటు ఒక దశలో పార్టీ పెద్ద దిక్కుల్లో ఒకరుగా సైతం పార్థ సారథి వ్యవహరించారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు . బీసీ సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పార్థ సారథి పెనమలూరు నుండి గెలవడానికి ఉపయోగ పడింది మాత్రం సాత్వికుడు.. మంచివాడు అన్న ఇమేజ్. జగన్ మోహన్ రెడ్డి 2019 లో ముఖ్యమంత్రి కాగానే తొలి కేబినెట్ లో మంత్రి పదవీ గ్యారెంటీగా దక్కే వారిలో పార్థ సారథి, ఆళ్ల రామకృష్ణ రెడ్డి లాంటి కొందరి పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా వారిని పక్కన పెట్టారు సీఎం జగన్. పోనీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లో అన్నా వీరికి మంత్రి పదవుల తప్పక దక్కుతాయని అందరూ భావించినా ఆ దఫా కూడా వీరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం జగన్ అత్యంత నమ్మకస్తుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి (RK) పార్టీ నుండి బయటకు వెళ్లిపోగా ఇప్పుడు పార్థ సారథి కూడా అదే బాటలో పయనించనున్నారని ఆయన కేడర్ చెబుతోంది


అవమానాలు తట్టుకోలేక పోతున్నాను : పార్థ సారథి
మంత్రి పదవి సంగతి పక్కన బెడితే ఇటీవల పార్థ సారథికి కనీసం సీఎం జగన్ ను నేరుగా కలిసే అవకాశం కూడా దొరకడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి కీలక పదవులు దక్కడంతో పాటు తనను పూర్తిగా పక్కన పెట్టేశారు అనే ఫీలింగ్ పార్థ సారథిని బాగా కుంగ దీసింది అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఈమధ్యే జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్థ సారథి వైసీపీ నాయకుల సమక్షం లోనే తాను అడుగడుగునా  అవమానాలు ఎదుర్కొన్నానని అయినా సీఎం జగన్ తనను గుర్తించడం లేదని వాపోయారు. ఎప్పుడైతే పార్ధసారధి అలా మాట్లాడారో అక్కడే ఉన్న మంత్రి జోగి రమేష్ వేదిక దిగి వెళ్లిపోతే.. మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్ దీనిపై స్పందిస్తూ పదవులు, సీట్లు కోసం మాత్రమే ఆశపడే వాళ్ళు పార్టీని వీడితే మంచిది అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ఇవన్నీ తట్టుకోలేకనే పార్థ సారథి పార్టీ మారే ఆలోచనకు వచ్చారని.. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో చంద్రబాబు, పార్థ సారథి ల మధ్య భేటీ జరిగింది అని చెబుతున్నారు. 


బాబు వ్యూహం అదే...... 
టీడీపీ కి అండగా ఉన్న బీసీలు 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకే జై కొట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారిని మళ్లీ తనవైపునకు తిప్పుకోవడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గంలో మంచివాడు ఆనే ఇమేజ్ ఉన్న పార్థ సారధిని పార్టీలోకి ఆహ్వానిస్తే మళ్లీ టీడీపీ ని బీసీల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు జగన్ సన్నిహితుడు ఇప్పుడు తమ దగ్గర ఉన్నాడు అంటూ మోరల్ గా తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అనేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఇక అన్నీ సవ్యంగా జరిగితే త్వరలో పార్థ సారథి టీడీపీ చేయందుకోవడానికి సర్వం సిద్ధమైనట్టే.