Good Morning Dharmavaram program: ధర్మవరం: రౌడీయిజం లేని ధర్మవరాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) అన్నారు. తన పాదయాత్రకు వెళ్లకూడదని ప్రజల్ని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల శ్రీరామ్ కి ఓటు వేయకపోతే చంపేస్తామని మేం బెదిరింపులకు పాల్పడినట్లుగా వైసిపి నాయకులు (YSRCP Leaders) ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంత దిగజారుడు రాజకీయాలు కేతిరెడ్డి చేయడనుకున్నాం, కానీ మా అంచనాలు మించిపోయి దిగజారి పోయారంటూ సెటైర్లు వేశారు.
గుడ్ మార్నింగ్ ద్వారా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏం చేశారు?
పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. మూడు రోజులుగా పాదయాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇప్పటివరకు గుడ్ మార్నింగ్ ద్వారా ఏం సమస్యలు పరిష్కరించారని ఆయన ప్రశ్నించారు. పైగా తాను పాదయాత్ర చేస్తుంటే నా వద్దకు సమస్యలు తీసుకురావద్దని బెదిరింపులకు గురి చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీ పేరుతో నేను ఎక్కడికి వెళితే ఆ కాలనీలో ప్రజలను అటువైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా శ్రీరామ్ వద్దకు వెళ్తే మీకు సంక్షేమ పథకాలు అందవని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తాను ముందు వెళ్తుంటే వెనకవైపు నుంచి శ్రీరామ్ కు ఓటు వేయకపోతే చంపేస్తామని మాది వెంకటాపురం అంటూ కొందరు కుట్రపూరిత చర్యలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. 
కేతిరెడ్డి గురించి ఎక్కువగా ఊహించుకున్నాను
గతంలో పరిటాల రవిపై కూడా ఇలాంటి కుట్రలే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ స్థాయికి దిగజారరని తాను అనుకున్నానని కానీ తానే కొంచెం ఎక్కువగా ఊహించుకున్నట్లు అర్థమవుతోందన్నారు. వెంకటాపురం ప్రాంత ప్రజలు చాలా చైతన్యంతో ఉంటారని ప్రజలను చంపితే.. ఓట్లు వేస్తారా లేదా అన్నది ఒక కనీస అవగాహన ఉంటుందని శ్రీరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంజాయి మత్తులో ఉండేవారు రేషన్ బియ్యం అక్రమంగా తరలించేవారు ఈవ్ టీజర్లు, ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ఇదేదో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తే బాగుంటుందన్నారు. ప్రజలు కూడా ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని ధైర్యంగా బయటికి వచ్చి సమస్యలు చెప్పాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.




ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా మూడవ రోజు పలు కాలనీలలో విస్తృతంగా పర్యటించారు. 32 వ వార్డు పరిధిలోని సత్యసాయి నగర్ లో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గిర్రాజు కాలనీ, దుర్గా నగర్, సుందరయ్య నగర్, ప్రియాంక కాలనీ, లక్ష్మీ చెన్నకేశవపురం, 25వ వార్డు ఇందిరమ్మ కాలనీ వరకు పాదయాత్ర సాగింది. మొత్తం ఎనిమిది వార్డుల్లో మూడవరోజు పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ రోడ్డు సమస్యలతో పాటు అభివృద్ధికి సంబంధించిన కొన్ని విషయాలను శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు సంబంధించిన సుమారు నాలుగు కోట్ల రూపాయల డబ్బును పక్కదారి పట్టించినట్లు శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై ప్రత్యేకంగా కమిషన్ వేసి ఎంక్వయిరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. 






దుర్గానగర్ కు చెందిన మహిళలు శ్రీరామ్ వద్దకు వచ్చి టైలరింగ్ వృత్తిపై ఆధారపడి పట్టణంలో దాదాపు రెండువేల మంది మహిళలు జీవిస్తున్నారని చెప్పారు. ఇటీవల రెడీమేడ్ షోరూంలు పెరిగిపోవడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. తమకు గార్మెంట్స్ పరిశ్రమలు లాంటివి తీసుకొస్తే ఉపాధి దొరుకుతుందని విజ్ఞప్తి చేశారు. దీనిపై శ్రీరామ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా గార్మెంట్స్ పరిశ్రమ స్థాపన కోసం కృషి చేస్తామని తెలిపారు. గతంలో రాప్తాడులో జాకీ పరిశ్రమను తీసుకొస్తే అక్కడ స్థానిక పరిస్థితుల కారణంగా వెనక్కి వెళ్లిపోయిందని ధర్మవరంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేస్తామన్నారు. 


టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు
ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుష షాకులు తగులుతున్నాయి. పరిటాల శ్రీరాం పాదయాత్ర సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. శ్రీరామ్ నాయకత్వంపై ఎంతో నమ్మకంతో తాము పార్టీలోకి వస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా 32వ వార్డుకు చెందిన షాదిక్, రిజ్వాన్ ఖాన్,షామీర్ అనే మైనార్టీ నాయకులు తమ అనుచరులైన 40కుటుంబాల వారితో కలిసి టిడిపిలోకి చేరారు. శ్రీరామ్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీరామ్ వారికి సూచించారు. ఇప్పటికే ధర్మవరంలో చాలామంది నేతలు టిడిపి వైపు చూస్తున్నారని కానీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భయపడి ఇటువైపు రావడం లేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని శ్రీరామ్ అన్నారు.