Aditya L1 Space Craft Reached its Destination: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1 (Aidtya L1) స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు శనివారం చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతమైంది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌకను సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. హాలో కక్ష్య నుంచి ఇది నిరంతరం సూర్యున్ని పర్యవేక్షిస్తుంది.
ప్రధాని అభినందనలు
'ఆదిత్య L1' మిషన్ సక్సెస్ పై ప్రధాని మోదీ (PM Modi) ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. 'సూర్యునిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ (Aditya L1 Space Craft) గమ్య స్థానానికి చేరుకోవడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనం. ఇస్రో సైంటిస్టులకు అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 2న ప్రయోగం
సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా 'ఆదిత్య L1' ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ - 57 వాహక నౌక ద్వారా 'ఆదిత్య L1' నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్స్ మోసుకెళ్లింది. ఈ వ్యోమ నౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కి.మీ ప్రయాణించి ఎల్ - 1 పాయింట్ లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఆ పాయింట్ లో ఉంటే సూర్యుడిని ప్రతి క్షణం పరిశీలించేందుకు వీలవుతుందని, అక్కడ సూర్య గ్రహణ ప్రభావం సైతం ఉండబోదని ఇస్రో గతంలో తెలిపింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తుపానుల నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను రక్షించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
అంతరిక్షంలో భారత్ కు 50కు పైగా శాటిలైట్లు ఉన్నాయని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somanath) గతంలో తెలిపారు. సౌర తుపానుల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా, ప్రమాదకర తరంగాల వల్ల విద్యుత్ వ్యవస్థకు సైతం ముప్పు కలిగించే అవకాశాలున్నట్లు చెప్పారు. అలాంటి ముప్పును అడ్డుకునేందుకే ఈ ప్రయోగం చేపట్టినట్లు వివరించారు.