YS Sharmila: రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె పాదయాత్ర నిర్మల్ జిల్లాలో సాగుతోంది. పాదయాత్ర ద్వారా జనాలకు దగ్గర అవుతున్న షర్మిల.. అదే సమయంలో ఇతర పార్టీల నాయకులపై తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆమె పాదయాత్ర వస్తోందంటే తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని, తమపై ఎలాంటి ఆరోపణలు చేస్తుందోనని స్థానిక నాయకుల హడలి పోతున్నారు. ఇప్పటి వరకు షర్మిల పాదయాత్ర చేసిన ప్రాంతాల్లోని స్థానిక నాయకులను చీల్చి చెండాడుతున్నారు షర్మిల. షర్మిల కేవలం ఏకు అని భావించిన నాయకులంతా ఆమె మేకై కూర్చోవడాన్ని చూసి జడుసుకుంటున్నారు.
తాజాగా నిర్మల్ జిల్లా పాదయాత్ర చేసిన షర్మిల.. మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో లోటు పాట్లు ఉన్నాయని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దళిత బంధను కాస్తా అనుచరుల బంధు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పు లేని రైతు లేడంటే అతిశయోక్తి కాదని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
'అది గుండె కాదు బండ'
రుణమాఫీ అని అన్నదాతలను అడ్డంగా మోసగించారు.. అవునా.. కాదా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, నిరుద్యోగులు ఇంకెంత కాలం వేచి చూడాలని, చాలా మంది ఉపాధి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ లో కనీసం చలనం కూడా లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఉన్నది గుండెనా లేదా బండనా.. రాష్ట్ర ప్రజలు బాధలు పడుతుంటే ఆయన మనుసు కరగదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాతీలో ఉన్నది గుండె కాదని, బండ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగాలు అడిగితే హమాలీ పనే బెస్ట్ అంటూ తీసిపరేస్తున్నారని, ఇంకెప్పుడు నిరుద్యోగుల జీవితాలు బాగు పడతాయో సీఎం చెప్పాలని షర్మిల నిలదీశారు.
ధరలు భారీగా పెంచేశారు..
పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వంట సరుకులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెరిగితే ప్రభుత్వం భరించేలా చేశారన్నారు. నాయకుడు అంటే వైఎస్ఆర్ అని చెప్పారు షర్మిల. బతికినంత కాలం ప్రజల కోసమే బతికారని, ప్రజల కోసమే చనిపోయారన్నారు. ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ లేనే లేదన్నారు. 8 ఏళ్లుగా కేసీఅర్ ను ప్రశ్నించే పార్టీ లేకుండా పోయిందని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడటం కోసం పార్టీ పెట్టానన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తామని అన్నారు షర్మిల.