రైతు ఆత్మహత్య అంశంపై నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ ఆమె మీడియా మాట్లాడారు. రవికుమార్ ఆత్మహత్యపై శాంతియుతంగా దీక్షచేస్తుంటే అరెస్టు చేస్తారా..? అని షర్మిల ప్రశ్నించారు. రవికుమార్ కు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారని.. ఒక బిడ్డ పెండ్లి చేశారని తెలిపారు. ఇంకో బిడ్డ చదువుకుంటోందని.. కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఆ అబ్బాయి మెడికల్ ఖర్చు చాలా అవుతుందన్నారు. పిల్లాడి మెడికల్ ఖర్చులు వైఎస్సార్ తెలంగాణ పార్టీ భరిస్తుందని చెప్పారు.
'రవికుమార్ దిగుబడి తక్కువగా రావడంతో నష్టానికి వరి ధాన్యం అమ్ముకున్నారు. ఇది ఆత్మహత్యా..కేసీఆర్ హత్యా..? వరి ఆకరి గింజ వరకు కొంటానని, ఇప్పుడు కేసీఆర్ కొనబోమని చెబుతున్నారు. కేసీఆర్ వరి వేసుకోనిచ్చి ఉంటే రవికుమార్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ముమ్మాటికీ రవికుమార్ చనిపోవడానికి కారణం కేసీఆర్..చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాలేరు. కేసీఆర్ రాజీనామా చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఈ పాపం పోయేది కాదు.' అని షర్మిల విమర్శించారు.
కనీసం ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. రవికుమార్ అబ్బాయి మెడికల్ కు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించకపోవడంతో 48 లక్షల రూపాయల అప్పుభారం ఆ కుటుంబంపై పడిందని తెలిపారు. అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
'కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..? ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి అవసరమా..? కేసీఆర్ కి ఏమి ఇవ్వడం చేతనైంది. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, వరి పంట కొనుగోలు, మూడెకరాల భూమి ఏది ఇవ్వడం కేసీఆర్ కు చేతకాదు.' అని షర్మిల విమర్శించారు.
బంగారు తెలంగాణ అని చెప్పి రైతులకు కేసీఆర్ బతుకు లేకుండా చేస్తున్నాడు. ఒక పంటకు మద్దతు ధర ఇచ్చిన తర్వాత ఆ పంట వేసుకోవద్దనే హక్కు ఎవరికి ఉంది..? మద్దతు ధర అంటే... మీరు ఈ పంట పండించండి ప్రభుత్వం ఈ ధరకు కొనుగోలు చేస్తుందని రైతుకు భరోసాను కల్పించాలి. మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీనిచ్చిన తర్వాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..? ఒక సారి రైతులకు హామీనిచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా..? వరి ధాన్యం కొనము అంటే కేసీఆర్ దగా కోరు అని ఒప్పుకుంటున్నారా..? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదా..?
- షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
కేంద్రంతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని షర్మిల అన్నారు. ముందు సంతకాలు పెట్టి వచ్చి ఇప్పుడు రైతులను బాధపెడితే ఎలా...? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో డ్రామాలు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందని.. ఎలక్షన్ ఇష్యూగా చేయాలని కేసీఆర్ వడ్లు కొనబోమని చెబుతున్నారని షర్మిల ఆరోపించారు.
'త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తాం. ధాన్యం కొనుగోలు చేయకపోతే అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. పాదయాత్రలో రైతుల వడ్లు కొనడం లేదని ప్రతి రోజూ మేం విన్నాం. రవికుమార్ అనే రైతు చనిపోతే ఒక్కరికైనా బాధ్యత లేదా..? వైఎస్సార్ బతికి ఉంటే ఇలా జరిగేదా..?' అని షర్మిల ప్రశ్నించారు.
Also Read: MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా
Also Read: వాళ్లు ఇచ్చేలా లేరు..మనమే ఆక్రమించుకుందాం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన మహిళలు