డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు మహిళలు. వాళ్లంతా లబ్ధిదారులే.. కానీ పంపిణీ జరగకముందే ఆక్రమించుకున్నారు. ఇళ్ల పంపిణీ ఆలస్యం అవుతుందని అధికారులతో వాదనకు దిగారు. ఎవరు చెప్పిన ఇళ్లు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పారు. అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. పట్టించుకోలేదు. ఇంకా ఎన్ని రోజులు వేచి చూస్తామంటూ.. తాళాలు పగులగొట్టి వెళ్లారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి రెండు పడక ఇళ్లను 49 నిర్మించారు. వాటిని కిందటి సంవత్సరం డ్రా పద్ధతి ద్వారా పంపిణీ చేయగా అందులో 6 ఇళ్లకు సంబంధించి.. కొంతమంది అడ్డు చెప్పారు. అయితే వాటిని పంపిణీ చేయకుండా తహశీల్దారు ఆపేశారు. ఇంత వరకు కూడా వాటిని విచారించకుండా అలానే ఉంచారు.
అయితే దేవరుప్పుల గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు ఈ రోజు ఉదయం తెల్లవారు జామున వారంతట వారే 6 ఇళ్ల తాళాలు పగులగొట్టి అందులో చేరారు. తమకు ఇళ్లు లేవని కిరాయి ఇళ్లల్లోనే ఉంటున్నామని చెప్పారు. రాజకీయంగా వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇళ్లను ఇచ్చుకుంటున్నారని తెలిసి వచ్చి చేరామని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసే వచ్చామని అందుకే ఉంటున్నాన్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ పి.శ్రీనివాస్ రెండుపడకల గదుల ఇళ్ల వద్దకు చేరుకుని విచారించారు. తాము నిరుపేదలమని.. ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చారు. కిరాయికి ఉంటున్నామని.. మాకివ్వకుండా భూమి ఉన్నవాళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పేదవాళ్ళు కూడా ఉన్నారన్నారు. అసలైన పేదవారికి ఇవ్వకుండా డ్రా పద్ధతి పెట్టి మమ్మల్ని ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో 49 ఇళ్లను లాటరీ పద్ధతిలో డ్రా తీసి లబ్ధిదారులకు అందజేశామని.. అందులో 6 మాత్రం ఆబ్జెక్షన్ లో ఆపారని తహశీల్దార్ తెలిపారు. ఆ ఇళ్లకు తాళం చెవిలు కాంట్రాక్టర్ దగ్గరే ఉన్నాయని.. అయితే ఈ రోజు ఉదయం కొంతమంది ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి ఆక్రమించుకున్నట్టు చెప్పారు. వాళ్ళందరూ కూడా పేదవారేనని..16 వరకు ఎంఎల్సీ కోడ్ ఉంది కావున ఆ తర్వాత విచారించి నిజమైన లబ్ధిదారులకు అందిస్తామని తహశీల్దార్ స్పష్టం చేశారు.
Also Read: F3 Movie: హైదరాబాద్‌లోని ఓ బిజీ ఏరియాకు హీరోలను తీసుకువెళ్లిన దర్శకుడు...