Youth Apologise To Mahatma Gandhi Statue In Boinapally: దీపావళి సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా మహాత్మాగాంధీ విగ్రహం నోట్లోనే టపాసులు పెట్టి కాల్చారు. ఇది వైరల్ కాగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పశ్చాత్తాపపడిన యువకులు అదే మహాత్ముని విగ్రహానికి పూలదండలు వేసి క్షమాపణలు చెప్పారు. ఈ వీడియో సైతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండుగ రోజున హైదరాబాద్ (Hyderabad) బోయినపల్లిలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొందరు యువకులు హల్చల్ చేశారు. మహాత్ముని నోట్లో టపాసులు పెట్టి కాల్చారు. అంతేకాకుండా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మహాత్మున్ని అవమానించారంటూ సదరు యువకులపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో యువకులు తీరు మార్చుకున్నారు. తాము చేసిన పనికి పశ్చాత్తాపపడ్డారు. గాంధీజీ విగ్రహానికి పూలదండలు వేసి మరీ క్షమాపణలు కోరారు. 'తెలిసీ తెలియక దీపావళి రోజున గాంధీ విగ్రహం వద్ద తప్పు చేశాం. మహాత్మాగాంధీ మాకు గౌరవం. క్షమించండి.' అని వేడుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోను సైతం విడుదల చేశారు. తమ పిల్లలను క్షమించాలని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని వారి తల్లిదండ్రులు సైతం క్షమాపణలు కోరారు.


Also Read: Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన