తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు రాజకీయ నేతల ప్రచారం ఊపందుకుంటే మరోవైపు ఎన్నికల అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డులోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పించాలని సీఈసీ ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలోని ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. అయితే, సదరు పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరుండాలని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేని, ఒక వేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కాని పక్షంలో పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలను తీసుకొస్తే ఓటు వేసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది.
ప్రత్యామ్నాయ పత్రాలివే
- ఓటరు గుర్తింపు కార్డు లేని సమయంలో ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
- ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు/పోస్టల్ కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్ ను చూపించి ఓటెయ్యొచ్చు.
- అలాగే, కేంద్ర కార్మిక శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు చూపించొచ్చు.
- రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్ యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు.
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
- కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ)
ఈ పరిస్థితుల్లో గుర్తింపు తప్పనిసరి
ఓటరు గుర్తింపు కార్డులో ఫోటోలు తారుమారు కావడం, ఇతర లోపాలున్నప్పుడు ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో నిర్దేశించిన ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని ఆధారంగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్ పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని సీఈసీ తెలిపింది. పోలింగ్ కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, టైం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే, ఇవి ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.
Also Read: Telangana Elections: ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత - ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా సీజ్