Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అంతర్రాష్ట సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలతో పాటు, రాష్ట్రంలోను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పెద్దఎత్తున డబ్బు, బంగారం, వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు.
రూ.243 కోట్లకు పైగా సీజ్
ఇప్పటివరకు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తోన్న రూ.243 కోట్లకుపైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి గురువారం వరకు మొత్తంగా రూ.243.76 కోట్ల విలువ డబ్బు, ఆభరణాలు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిన్న ఒకే రోజు తనిఖీల్లో రూ.78.03 కోట్ల సొత్తు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో రూ.120.40 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడ్డాయి. గత 24 గంటల్లో 83 కిలోల బంగారం, 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే హైదరాబాద్ పరిధిలోని చైతన్యపురిలో ఓ వ్యక్తి నుంచి రూ.97 లక్షలను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో పట్టుబడిన వ్యక్తి రాజేష్‌గా గుర్తించారు. పట్టుబడిన డబ్బు బ్రింక్స్ ఇండియా కంపెనీకి చెందిందని, అందులో తాను కలెక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నట్లు రాజేష్ వెల్లడించారు.
ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎవరైనా రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి ఉంటే వాటిని పోలీసులు సీజ్ చేస్తారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది.
తెలంగాణకు 4 రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. మొత్తం148 చెక్‌పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎవరైనా తమ వెంట పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తుంటే, అందుకు సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమం.
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. రోగి రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోండి. ఏదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. ఖాతా పుస్తకం లేదా ఏటీఎం రశీదు వంటివి తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి.
Also Read: Telangana Election 2023: ఓటర్లకు బిగ్ అలర్ట్ - 'లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి'