ACB: కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను లంచాల కోసం వేధిస్తూనే ఉంటారు. తాజాగా, హైదరాబాద్ లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం ఓ వ్యక్తిని టౌన్ ప్లానింగ్ అధికారి లంచం ఇవ్వాలని వేధించగా అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో సదరు అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


కొద్దిరోజుల క్రితం గుర్రంగూడకు చెందిన సుధాకర్‌రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం హయత్‌నగర్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ఉమను కలిశారు. అనుమతి కోసం ఉమ రూ.లక్షన్నర లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు సుధాకర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సరూర్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. సుధాకర్ రెడ్డి నుంచి నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటున్న హయత్‌నగర్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ఉమతో పాటు అదే విభాగంలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి లక్ష్మణ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ అలీ తెలిపారు.


కారు బిల్లుల మంజూరుకు లంచం అడిగిన అధికారి


నిజామాబాద్‌ నగరానికి చెందిన కోనేటి విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన కారును డీపీఆర్వో కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ (DEIE)గా విధులు నిర్వర్తిస్తున్న వేణి ప్రసన్న అనే అధికారిణి వద్ద అద్దెకు పెట్టాడు. అందుకు గాను ప్రతి నెలా రూ.33 వేల అద్దె అగ్రిమెంట్‌ చేసుకున్నారు. కారుకు మూడు నెలల నుంచి బిల్లులు రాలేదు. తనకు ఆఫీస్‌ నుంచి రావాల్సి రూ.99 వేల బిల్లు మంజూరు అయ్యేలా చూడాలని విజయ్‌ కుమార్‌.. వేణి ప్రసన్నను కోరాడు. 


దీంతో మూడు నెలల బిల్లులకు గాను నెలకు రూ.3 వేల చొప్పున రూ.9 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. తనకు న్యాయంగా రావాల్సిన డబ్బులకు లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు గురువారం వేణి ప్రసన్నకు లంచం ఇస్తుండగా నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సదరు అధికారిణిపై కేసు నమోదు చేసి, కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.


హెచ్ఎండీఏ అనుమతుల కోసం రూ.5 లక్షలు డిమాండ్


రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో సిమెంట్ బ్రిక్స్ యజమాని మధుసూదన్ రెడ్డికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులు ఉన్న గ్రామ పంచాయతీ పర్మిషన్ కోసం పంచాయతీ సెక్రటరీ అధికారులు రూ. 5 లక్షలను డిమాండ్ చేయగా.. రూ. 2.5లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అయితే బుధవారం రాచులుర్ పంచాయతీ సెక్రెటరీ నరేందర్ డబ్బులు తీసుకుంటుండగా.. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.