Mandava Congress :  భారత రాష్ట్ర సమితిలో చేరినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనకుండా సైలెంట్  గా ఉన్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆయనతో టీ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డితో పాటు  ఇతర సీనియర్ నేతలు చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ లో ఆయనకు ఎలాంటి పని చెప్పలేదు. పదవి ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో పోటీకి ఆయన పేరును కూడా ఎక్కడా పరిశీలించలేదు. దాంతో సైలెంట్ గా ఉన్నారు. బలమైన అభ్యర్థుల కోసం వెదుకుతున్న కాంగ్రెస్ పార్టీకి టీడీపీ సీనియర్ నేతలు మంచి ఆప్షన్  గా కనిపించారు. 


తుమ్మల, రేవూరి తర్వాత మండవ చేరే చాన్స్


ఇప్పటికే టీడీపీ మాజీ సీనియర్లు అయిన తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మండవ వెంకటేశ్వరరావు కూడా చేరనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి.. రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి పోటీ చేసే చాన్స్ ఉంది. మండవ వెంకటేశ్వరరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా తేలలేదు. ఆయన గతంలో డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్  నుంచిపోటీ చేసి ఐదు సార్లు గెలిచారు. ఈ సారి నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు , ముగ్గురు నేతలు సర్వం సిద్ధం చేసుకున్నారు. గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అందుకే నిజామాబాద్ నుంచి మండవకు చాన్సివ్వడం కన్నా వేరే స్థానాన్ని పరిశీలించడం మంచిదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. 


కూకట్ పల్లి నుంచి మండవకు చాన్సిస్తారా ?


హైదరాబాద్ సిటీలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరు. ఏపీ సెటిలర్లు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతో మండవకు చాన్సిస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది . అందులో మెరుగైన ఫలితాలు వస్తే.. ఆయనను పార్టీలో చేర్చుకుని వెంటనే కూకట్ పల్లి సీటును  ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలతో పాటు .. ఓ ప్రధాన వర్గాన్ని సంతృప్తి పరిచినట్లు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు బావిస్తున్నారు. 


తెలంగాణ రాజకీయాల్లోసీనియర్ మండవ 
 
మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాజకీయాల్లో సీనియర్లలో ఒకరు. కేసీఆర్ తో పాటు టీడీపీలో మంత్రిగా పని చేశారు. ల డిచ్ పల్లి సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున వరుసగా గెలిచిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. కానీ కేసీఆర్ ఆయనకు ఓ పదవి ఇద్దామని కానీ.. లేదా పార్టీ పని చెబుదామని కానీ ఎప్పుడూ అనుకోలేదు. దాంతో ఆయన  రాజకీయ జీవితం కూడా డైలమాలోనే ఉంది. ఈ ఎన్నికల సమయంలో.. ఆయన మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహపడుతూంటం.. కాంగ్రెస్ అవకాశం కల్పించే చాన్స్  ఉండటంతో.. పాత సీనియర్లు అంతా మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు అయింది.