Pravalika Suicide Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవళిక ఆత్మహత్య వెనుక శివరాం పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న శివరాంను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టాక.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శివరాంను ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.


అప్పటి నుంచే అజ్ఞాతంలోకి


ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించడం లేదు. ప్రవళిక మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ పరీక్షల వాయిదాల వల్లే మానసిక ఒత్తిడితో చనిపోయిందని సహచరులు, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి ఆందోళనకు దిగడంతో విషయం రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సర్కారుపై విమర్శలు చేశారు. 


ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవళిక స్నేహితులను ప్రశ్నించారు. శివరాంతో పరిచయం గురించి వారు చెప్పగా ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రవళిక చనిపోయినప్పటి నుంచి శివరాం కనిపించకపోవడం కూడా వారి అనుమానాలను మరింత పెంచింది. ప్రవళిక ​ఫోన్ డేటా, వాట్సాప్ చాట్ రికవరీ చేశారు. శివరాం వేధింపుల వల్లే చనిపోయిందని నిర్ధారణకు వచ్చారు.


HRCని ఆశ్రయించిన శివరాం కుటుంబం


మరోవైపు, శివరాం కుటుంబ సభ్యులు తాజాగా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ కేసులో శివరామ్ ను పోలీసులు కావాలనే ఇరికించారని ఆరోపించారు. గురువారం నుంచి శివరాంను వేధిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు.


ప్రవళిక తల్లి ఏం చెప్పారంటే?


ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లి విజయ స్పందించారు. శివరాం అనే యువకుడి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు వాపోయారు. 'నా కుమారుడు,  కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ చదువుకుంటున్నారు. కాయ కష్టం చేసి కష్టపడి కోచింగ్ ఇప్పించాం. అయితే, ప్రవళికను శివరాం ప్రేమ పేరుతో వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వారికి రాకూడదు. బిడ్డ పోయిన బాధలో ఉన్నాం. రాజకీయాలుంటే మీరు మీరూ చూసుకోండి. అంతే తప్ప మా కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు.' అంటూ ఆమె వాపోయారు. తన అక్క ప్రవళిక చావుకు శివరామే కారణమని ఆమె సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. అతన్ని కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు తమను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.