బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టాక దేశాన్ని సర్వనాశనం చేసిందని తెంలగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. భువనగిరిలో నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్... తెలంగాణ కోసం భువనగిరి ప్రజలు బెబ్బులిలా పోరాటం చేశారన్నారు. ఉద్యమంలో తన వెంట ఉండి నడిపించారన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్ర సాయం అందకపోయినా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వలసలు వెళ్లారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాగునీరు, విద్యుత్‌ ఉచితంగా ఇవ్వడంలేదన్నారు. ఒక్క తెలంగాణలోనే 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. 


ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ 


'భువనగిరి జిల్లా కేంద్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. పరిపాలన సౌలభ్యం కోసం భువనగిరిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. కాళేశ్వరం ద్వారా బస్వపూర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు  పుష్కలంగా వస్తాయి. నూతన కలెక్టరేట్ ను అద్భుతమైన రీతిలో నిర్మించారు. భగీరథ పథకంతో స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి అందుతున్నాయి. పెన్షన్ లు, గురుకుల స్కూల్స్, సాగు నీరు అన్నింటిలో విజయం సాధించాం. 24 గంటల నాణ్యమైన కరెంట్ ను అందిస్తున్నాం. అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచాం. ఎన్నో రంగాల్లో ఎన్నో రాష్టాలకు తెలంగాణ ఆదర్శంగా ఉంది. తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినమో ప్రగతి కోసం కూడా ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఐటీ రంగంలో నంబర్ 2 స్థానంలో ఉన్నాం. ఇవ్వాళ తెలంగాణలో మూడు ఎకరాలు ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు.' అని సీఎం కేసీఆర్ విమర్శించారు. 


ఏం చూస్తావో చూడు బిడ్డ


దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీకి పిచ్చి ముదిరిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఎడిపించారన్నారు. పోరాటం చేస్తున్న రైతులను  ఉగ్రవాదులుగా క్రియేట్ చేశారన్నారు. కార్లతో గుద్ది చంపారని ఆరోపించారు. రైతులను బలి తీసుకొని క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నారు ప్రధాని మోదీ అని కేసీఆర్ అన్నారు. రైతుల జోలికి వస్తే అధోగతి పాలవుతారన్నారు. వ్యవసాయ బావులకు మోటార్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. కేసీఆర్ సంగతి చూస్తా అని బీజేపీ నేతలు అంటున్నారని, మోదీ ఏం చూస్తావో చూడు బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. 


దేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా? 


'కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా. బీజేపీ వల్ల మతపిచ్చి పెరుగుతుంది. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. దేశం నీ సొత్తు కాదు దేశాన్ని నాశనం చేస్తుంటే చేతులు ముడుచుకొని ఎవ్వరు కూర్చొరు. కర్ణాటకలో ఇవ్వాళ ఏం జరుగుతుంది. బెంగుళూరులో ఆడ బిడ్డలపై అలా వ్యవహరించడం తగునా చెప్పు మోదీ. సిలికాన్ వ్యాలీ లాంటి బెంగుళూరును నాశనం చేస్తున్నారు బీజేపీ వాళ్లు. సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీ చేస్తారా. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. మోదీ ఫెయిల్యూర్ వల్ల పరిశ్రమలు అన్ని మూత పడుతున్నాయి. అమెరికాలో మెజార్టీ  క్రిస్టియన్ లు ఉన్నా ఏనాడు మత గొడవలు పెట్టుకోలే. ఇవ్వాళ బీజేపీ చేస్తున్న దమన నీతితో దేశం అల్లకొల్లలం అయ్యేలా ఉంది. దేశాన్ని ఆకలి రాజ్యం చేస్తారా' అని కేసీఆర్ విమర్శించారు.