"రీల్ లైఫ్ (సినిమాల్లో) మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్ తదితరులు సెంటర్ ఫ్రేములో ఉండి పంచ్ డైలాగ్స్ చెబుతారు. రియల్ లైఫ్ (నిజ జీవితంలో) వై.ఎస్. జగన్ సెంటర్ ఫ్రేములో ఉన్నారు. స్టార్స్ అందరూ భయపడి జూనియర్ ఆర్టిస్టుల్లా బిచ్చమడిగారు" అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతి త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని చిరంజీవి తెలిపారు. రాజమౌళి సహా అందరూ ఆయన చేసిన కృషిని కొనియాడారు. అవకాశం వస్తే ఎప్పుడూ విమర్శలు చేయడానికి ఎదురు చూసే వర్మ, ఏపీ సీఎంతో సమావేశం తర్వాత స్టార్స్ మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.
"వై.ఎస్. జగన్ మెగా సూపర్ డూపర్ ఒమెగా స్టార్. హీరోలు అందరూ పెద్ద బొచ్చు పట్టుకుని ఆయన్ను దేవుడిగా కొలిచారు. నిజమైన పవర్ ఫుల్ స్టార్ ఒమెగా స్టార్ అంటూ వాళ్ళ అభిమానులకు చెప్పారు. భక్తుల మనవి ఆలకించిన భగవంతుడు కొన్ని రేట్స్ పెంచడానికి అంగీకరించాడు. పెంచిన రేట్లు తక్కువగా ఉన్నా వీళ్ళు ఏమీ మాట్లాడరు. నేను ఒమెగా స్టార్ ఫ్యాన్ అయ్యాను" అని వర్మ ట్వీట్స్ చేశారు.