IPL Mega Auction 2022: ఐపీఎల్ మ్యాచులు, ఐపీఎల్ వేలానికి తేడా ఉండదు! ఎప్పుడెలా సాగుతాయో ఊహించడం కష్టం! వేలానికి ముందు డేవిడ్ వార్నర్ (David Warner) భారీ ధర పలుకుతాడని అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.6.25 కోట్లకే దక్కించుకుంది. నిజం చెప్పాలంటే అతడిని తక్కువ ధరకు కొట్టేసినట్టే అనుకోవాలి!
Delhi Capitals ఆసక్తి
వేలంలో డేవిడ్ వార్నర్ పేరు రాగానే అందరికీ ఆసక్తి కలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడి కోసం సరదాకైనా ఒకసారి బిడ్ వేస్తుందా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆక్షనీరు అతడి పేరు చెప్పగానే ఒక నిమిషం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మొదట దిల్లీ అతడికి బిడ్ వేసింది. వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. ఆపై ముంబయి ఇండియన్స్ ప్రవేశించింది. దాంతో చూస్తుండానే అతడి ధర రూ.6 కోట్లకు చేరుకుంది. ఆపై దిల్లీ రూ.6.25 కోట్లకు బిడ్ వేసింది. తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో అనుకున్న స్థాయి కన్నా తక్కువ ధరకే వార్నర్ అమ్ముడుపోయాడు.
తెరవెనుక Ricky Ponting వ్యూహం
దిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్‌ను తీసుకోవడం వెనక మంచి వ్యూహమే ఉంది! ఆ జట్టు కోచ్, మెంటార్ రికీపాంటింగ్ తెలివిగా ఆలోచించాడు. వాస్తవంగా బహుళ జట్లు ఆడే టోర్నీల్లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తిరుగులేదు. అతడి కోసం దిల్లీ ప్రయత్నించినా ఎక్కువ ధరతో పంజాబ్ కింగ్స్ అతడిని కొనేసింది. దాంతో దూకుడుగా ఆడే ఎడమచేతి వాటం ఆటగాడి కోసం దిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించింది. ఆ లక్షణాలన్నీ వార్నర్‌లో ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలు పంచుకోగలడు. ఓపెనింగ్ చేయగలడు. ప్రత్యర్థిని ఊచకోత కోయగలడు. పైగా దిల్లీకి కుడిచేతి వాటం ఓపెనర్ పృథ్వీ షా ఉన్నాడు. అతడికి వార్నర్ కలవడంతో ఓపెనింగ్ జోడీ భయంకరంగా మారుతుంది. నిజానికి వార్నర్ ఐపీఎల్ కెరీర్ దిల్లీతోనే మొదలైంది.
IPLలో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడు
ఇండియన్ ప్రీమియర్ లీగులో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడు డేవిడ్ వార్నర్. ప్రతి సీజన్లో అతడు 500+ పరుగులు చేస్తాడు. గతేడాది అంతగా ఫామ్‌లో లేడు. కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 150 ఇన్నింగ్సుల్లో 42 సగటు, 139 స్ట్రైక్‌రేట్‌తో 5,449 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 50 అర్ధశతకాలు దంచేశాడు. లీగులో 69 మ్యాచులకు సారథ్యం వహించగా 35 గెలిచి 33 ఓడాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. తక్కువ ధర పలికాడు కాబట్టి కసిగా పరుగులు చేసే అవకాశం ఉంది.