హైదరాబాద్: తెలంగాణలో కుల గణన (Caste Census) ఇటీవలే జరిగింది. ఇది దేశమంతటా అమలు చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతీ వేదికపైన  "జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్" (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)  కల్పించాలని  ఆ పార్టీ అగ్రనేత , లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ  ప్రవచిస్తున్న విషయం తెలిసిందే.  అయితే  తెలంగాణ సర్కార్ తమ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కుల గణన విషయంలో రాకెట్ వేగంతో పని చేసింది.  తెలంగాణ రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపంది. తెలంగాణ  మోడల్ అనుసరించి దేశ వ్యాప్తంగా  జన గణన సమయంలోనే కుల గణన జరపాలని డిమాండ్  చేసింది.  

ముందు ససేమిరా అన్న ఎన్డీఏ ప్రభుత్వం  జన గణనతో పాటు కుల గణన చేస్తామని చెప్పి ఓ కొత్త రాజకీయ వ్యూహాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఇప్పుడు  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సాహసోపేతమైన  నిర్ణయానికి సిద్ధమవుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. టీపీసీసీ కమిటీల నియామకంలో కుల గణనకు అనుగుణంగా కమిటీల కూర్పు ఉంటుందా లేదా అన్న  ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సీఎం  రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. ఏఐసీసీ  సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్  తో పీసీసీ కమిటీల కూర్పు, మంత్రి వర్గ విస్తరణపై  చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఆ కమిటీలు రాహుల్ గాంధీ  డిమాండ్ చేసినట్లు  జనభా ప్రాతిపదికన ఉంటుందా , రాష్ట్రంలో కుల గణనకు అనుగుణంగా సామాజిక వర్గాల నేతలకు న్యాయం చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు ముందున్న ప్రశ్న

టీపీసీసీ కమిటీల స్వరూపం ఇలా.....

 తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు అనేది అప్పటి పరిస్థితులను బట్టి, ఆశావాహులను బట్టి, పార్టీలో అసంతృప్త నేతలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది , ఈ  కారణాలను బట్టి టీపీసీసీ  స్వరూపం తరచూ మారూతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధాన కమిటీలు వాటి స్వరూపం  ఎలా ఉందో చూద్దాం.

1. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు -  ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే అత్యంత కీలకమైన పదవి. ప్రస్తుతం బీసీ నాయకుడు అయిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్  ఈ పదవిలో కొనసాగుతున్నారు. 

2. వర్కింగ్ ప్రసిడెండ్  లేదా కార్యనిర్వాహక అధ్యక్షులు -  పార్టీ అధ్యక్షుడికి  పార్టీ కార్యక్రమాల్లో సహాయకారిగా ఉండేందుకు  ఈ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రస్తుతం నలుగురు వర్కింగ్ ప్రసిడెంట్లను నియమిస్తున్నారు.  ఇందులో పార్టీ సీనియారిటీ,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ కోటాలను పరిగణలోకి తీసుకుని వర్కింగ్ ప్రసిడెంట్లను పార్టీ నియమిస్తుంది.

3.  వైస్ ప్రసిడెంట్స్ లేదా ఉపాధ్యక్షులు -   టీపీసీసీలో వర్కింగ్ ప్రసిడంట్స్ తర్వాత కీలక పదవి ఇది.  వీరు పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు.  అటు పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రసిడెంట్లతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. దాదాపు 10 నుండి 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులుగా  ఉండే అవకాశం ఉంది. సందర్భానుసారంగా ఈ సంఖ్య మారే అవకాశం ఉంది.

4. పార్టీ జనరల్ సెక్రటరీస్ లేదా ప్రధాన కార్యదర్శులు -  పార్టీలో మరో కీలకమైన పదవి ప్రధాన కార్యదర్శి పదవి. వీరు పార్టీలోని  అంతర్గత, సంస్థాగత వ్యవహాలను చూస్తారు.  ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు  ప్రధాన కార్యదర్శుల ఉండే అవకాశం ఉంది.  ఆ జిల్లాను సమన్వయం చేయడానికి . ఇక హైదరాబాద్, రంగా రెడ్డి నుండి ఎక్కు మంది ప్రధాన కార్యదర్శులు ఉండే అవకాశం ఉంది.  దాదాపు 80 మంది ప్రధాన కార్యదర్శులుగా ఉండే అవకాశం ఉంది. 

5. పార్టీ  సెక్రటరీస్ లేదా కార్యదర్శులు -   పార్టీ ఇచ్చే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో వీరు కీలకంగా పని చేస్తారు. క్షేత్ర స్థాయిలో అటు ప్రజలు, ఇటు పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తారు. పార్టీ తీసుకునే నిర్ణయాలను వీరు అమలు చేస్తారు. దాదాపు 40 మందిని ఈ పదవుల్లో నియమించే అవకాశం ఉంది.

6. పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ లేదా పార్టీ అధికార ప్రతినిధులు - వీరు పార్టీ తీసుకున్న నిర్ణయాలను, పార్టీ కార్యక్రమాలను, ఆయా అంశాలపై పార్టీ తీసుకునే  స్టాండ్ ను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. వీరు దాదాపు  ఐదు నుండి పది మంది ఉండే అవకాశం ఉంది

7,  పార్టీ క్యాంపెయిన్ కమిటీ లేదా ప్రచార కమిటీ -  ఈ కమిటీ పార్టీ కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను రూపొందించడం, వాటిని  అమలు చేయడం ప్రధాన విధి. ఇది ఎన్నికల అవసరాలను బట్టి ప్రచార కమిటీ సభ్యుల సంఖ్య మారుతూ ఉంటుంది.

8. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ లేదా క్రమ శిక్షణ కమిటీ -  ఇది పార్టీ సభ్యులు, పార్టీ నియమాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే  ఆ సభ్యులను విచారిస్తుంది.  తప్పని తెలితే తీసుకోవాల్సిన క్రమ  శిక్షణ చర్యలను పార్టీ అధ్యక్షునికి సిఫారసు చేస్తుంది. ఇందులో పార్టీలోని సీనియర్లను నియమిస్తారు. దాదాపు  7గురి వరకు అవకాశం కల్పించ వచ్చు.

9. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ రూపొందించిన దేశ వ్యాప్త కార్యక్రమాలు లేదా ప్రచార కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసేలా చూస్తుంది.  ఏఐసీసీ  చేసే సూచనలను, ఆదేశాలను పార్టీలోను, రాష్ట్రంలో పార్టీ తరపున అమలు చేసే కమిటీ. ఏఐసీసీకి, రాష్ట్ర పార్టీకి మధ్య అనుసంధాన కర్తగా ఈ కమిటీ పని చేస్తుంది.

10. రాజకీయ వ్యవహారాల కమిటీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ ) -  ఈ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు సభ్యులుగా ఉంటారు. వీరు పార్టీకి సంబంధించి రాష్ట్రంలో తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలను ఈ కమిటీ  తీసుకుంటుంది.  అవసరమైన సలహాలు సూచనలను పార్టీకి అందిస్తుంది. 

ఈ కమిటీలతో పాటు చేరికల కమిటీ,  ఎన్నికల సమయంలో పార్టీ మ్యానిఫెస్టో తయారు చేసే కమిటీల వంటిివి ఉంటాయి.  ఇక క్షేత్ర స్థాయిలో జిల్లా కమిటీలు, బ్లాక్, మండల, గ్రామ కమిటీలు ఉంటాయి.  కార్మిక, రైతు, విద్యార్థి , యువత, మహిళ, మైనార్టీ వంటి అనుబంధ కమిటీలు ఉంటాయి.  ఈ కమిటీల కూర్పు  పార్టీ సీనియారిటీ, వారి పని తీరు, కుల సమీకరణలను బట్టి  జరుగుతుంది.

కుల గణన తర్వాత పీసీసీ కార్యవర్గ కూర్పు కత్తి మీద సామే 

పార్టీ లేదా అధికార పదవులు కుల గణనకు ముందు ఒక లెక్క,  కుల గణన తర్వాత ఒక లెక్క. ఇప్పుడు  ఏ మాత్రం తమ జనాభాకు అనుగుణంగా పదవులు ఇవ్వకపోతే  అటు ప్రత్యర్థి పార్టీలు, కుల సంఘాలు, ప్రజల నుండి వ్యతిరేకత  తప్పదు. ఇంకా చెప్పాలంటే స్వంత పార్టీ నుంచే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనిపై అటు ఏఐసీసీ, పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కూర్పుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. రేవంత్ సర్కార్ కుల గణనలో  ముస్లింలతో సహా బీసీలు 56.32% (బి.సి.లు 46.25%, ముస్లిం బి.సి.లు 10.08%) ఉన్నారు. ఎస్సీలు17.43%, ఎస్టీలు 10.45% , ముస్లింలలో ఓసీలు 2.48 శాతం కలుపుకుని మొత్తం  ఓసీలు 15.79%  ఉన్నట్లు లెక్క తేలింది. ఇప్పుడు   ఇదే  లెక్కన  పీసీసీ కమిటీల్లో సామాజిక సమీకరణాలు ఉండాల్సి ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా పార్టీ లోని ఆయా సామాజిక వర్గాల  ఆశావాహుల నుండి తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది.  అంతే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు  ఇదే అంశాన్ని ఎత్తి ప్రజల ముందు , ఆయా సామాజిక వర్గాల ముందు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టే అవకాశం ఉంది.

సామాజిక సమీకరణాలను బట్టి రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీ నేతలకు రాజకీయ అధికారాన్ని పార్టీ లో కట్టబెట్టాల్సి ఉంటుంది.  ఇది కేవలం పార్టీ పదవుల్లోనే కాకుండా అధికార పదవులకు  ఇక నుంచి వర్తింపజేసేలా కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీల్లోను ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుల గణన విషయంలో ముందున్నట్లే, పార్టీలో అంతర్గత కమిటీల్లో సామాజిక న్యాయం చేసే విషయంలో కూడా ముందుంటుందా  లేదా విమర్శలకు తావిస్తుందా అన్నది  తేలాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.