Congress MP Gaddam Vamsi Krishna | కాళేశ్వరం: డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను అంటూ కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు తనకు ఆహ్వానం దక్కకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడుని అయినందుకే ఇలా జరిగిందని.. ప్రజా ప్రతినిధి అయి ఉండి తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
ఆహ్వానం అందనందుకు చాలా బాధపడ్డాను..
సరస్వతీ పుష్కరాల గురించి చెప్పాలంటే నిజంగా చాలా బాధేసింది. నా హక్కుల కోసం పోరాడిన దళిత నేతలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మీ ఐకమత్యం, మీ మద్దతుతో నా హక్కులు పోరాడి సాధించుకున్నాను. ఈ రోజు చాలా ముఖ్యమైన విషయం నేను నేర్చుకున్నాను. డబ్బు కంటే కులమే గొప్పదని నాకు జరిగిన సంఘటనతో తెలిసొచ్చింది. కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను. సరస్వతీ పుష్కరాలకు ఆహ్వానించకపోవడంతో చాలా బాధపడ్డాను
రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడతాం..
రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలకు వెళ్లొచ్చని మరొకసారి గుర్తుచేస్తున్నాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఆర్టికల్ 15బీ, ఆర్టికల్ 17 అంటరానితరం నేరమని.. మత, ప్రార్థనా స్థలాలలో అందరికీ సమాన అవకాశం ఉంటుంది. ఎవరిపై వివక్ష చూపకూడదని’ కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అన్నారు. అంటరానితనం, కుల వివక్ష, ఇతర వివక్షలపై రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల ద్వారా పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
ఎంపీ నియోజకవర్గంలోనే పుష్కరాలు
సరస్వతీ పుష్కరాలను ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈనెల 15 వతేదీన కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుష్కరపూజ నిర్వహించారు. ఐటీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఆయన నియోజకవర్గంలోనే పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరాలు జరుగుతున్న ప్రాంతం ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి పరిధిలోేనే ఉంది. మరి ప్రభుత్వం తరపున అధికారిక కార్యక్రమం నిర్వహించినప్పుడు.. ప్రోటోకాల్ అధికారులు తప్పనిసరిగా స్థానిక ఎంపీకి ఆహ్వానం ఇస్తారు. అయితే ప్రోటోకాల్ విభాగం కాకుండా ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైనాా విస్మరించారా.. అందుకే ఎంపీ నొచ్చుకున్నారా అన్నది తెలియడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ.. జిల్లా మంత్రి నుంచి కానీ ఆహ్వానం అందనందునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనుకుంటున్నారు.
నేటితో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు..
సరస్వతి పష్కరాలు కాళేశ్వరంలో నేటితో ముగియనున్నాయి. నేడు చివరిరోజు కావడంతో పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. త్రివేణి సంగమం దగ్గర వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు సప్త హారతులు ఇవ్వనున్నారు. నేడు చివరిరోజు కావడంతో పూజారులు చండీ హోమం నిర్వహించనున్నారు. వీఐపీ ఘాట్ వద్ద నేడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7:46 నిమిషాలకు డ్రోన్ షో ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. మరోవైపు చివరి రోజు భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Also Read : KTR Latest News: కవిత వ్యాఖ్యలపై తొందరపడొద్దు, కేసీఆర్‌తో భేటీ అనంతరం పార్టీ నేతలకు కేటీఆర్ సూచనలు!