Modi Warangal Tour :   తెలంగాణ బీజేపీ అధ్యక్షునికి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకం ఉన్న పళంగా అమలులోకి వస్తుందని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఇప్పుడు కిషన్ రెడ్డి ముందు ఉన్న  లక్ష్యం ఎనిమిదో తేదీన ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడం. తన నియామకంపై పార్టీలో నేతలెవరికీ అసంతృప్తి లేదని అందర్న కలుపుకుని వెళ్తానని నిరూపించగలగడం. ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఊహించనంతగా పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశాలు లేవన్న సూచనలు కనిపిస్తున్నాయి. 


ఎనిమిదో తేదీన మోదీ వరంగల్ టూర్ 


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన తెలంగాణకు రానున్నారు. వారణాసి నుంచి నేరుగా  హైదరాబాద్‌కు వస్తారు. 8వ తేదీన ఉదయం 9.45 గంటలకు ఆయన వారణాసి నుంచి హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 గంటల కల్లా వరంగల్‌లో దిగుతారు.  ఉదయం 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కాజీపేట వ్యాగన్ ఓవర్‌హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత వరంగల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు వరంగల్ నుంచి తిరిగి హకీంపేట్‌కు వెళ్లుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. 


వరంగల్ పర్యటనకు భారీ ఏర్పాట్లు                                 


మోదీ వరంగల్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు. కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే ఏర్పాట్లపై ఎలాంటి ప్రభావం పడకుండా.. జన సమీకరణ విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహిరంగసభ ను విజయవంతం  చేయడానికి కిషన్ రెడ్డి స్వయంగా  రంగంలోకి దిగుతున్నారు. పార్టీ నేతలందరితో మాట్లాడుతున్నారు. 


ప్రధాని సభకూ అందరూ హాజరవుతారా ?                                   


ప్రధాని సభకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలందరూ హాజరు కావడంపై సస్పెన్స్ నెలకొంది.  రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి పదవి ప్రకటించలేదు.  దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. బీజేప సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేదంటున్నారు. అలాగే మరికొందరు నేతలు కూడా బండి సంజయ్ ను మార్చడంపై అసంతృప్తితో ఉన్నారు. ఈటల రాజేందరే కాదని.. తాను కూడా ఉద్యమం చేశానని విజయశాంతి వాపోయారు. తెలంగామ కాంగ్రెస్ లో  ప్రచార కమిటీ చైర్మన్ పదవి వదులుకుని బీజేపీలోకి వచ్చినా  ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వడం లేదు.