హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ విజయంతో భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ దగ్గర్నుంచి అందరూ టీఆర్ఎస్‌ పనైపోయిందని ఇక అంతా బీజేపీ హవానేనని చెబుతున్నారు. అయితే నిజంగా హుజురాబాద్‌లో గెలిచింది బీజేపీనా ? అన్నదానిపై చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాంకేతికంగా పార్టీ పరంగా గెలిచింది భారతీయ జనతా పార్టీనే. గుర్తు కూడా కమలమే. కానీ అక్కడ పోటీ జరిగింది మాత్రం బీజేపీ - టీఆర్ఎస్ మధ్య కాదు అనేది ఎక్కువ మంది అంగీకరించే అంశం. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సాగిన పోరాటంలో బీజేపీ తరపున ఈటల నిలబడ్డారు కాబట్టి బీజేపీ గెలుపు అనే మాట వినిపిస్తోంది కానీ నిజంగా చెప్పాలంటే అది ఈటల గెలుపుగా అభివర్ణిస్తున్నారు. 


Also Read : "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?


ఈటల చేరికతోనే హుజురాబాద్‌లో బీజేపీకి క్యాడర్ !


ఈటల రాజేందర్ నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్ నేత. కేసీఆర్‌కు అనుంగు అనుచరుడు. తమ్ముడు అని కేసీఆర్ ఆప్యాయంగా పిలిచే సన్నిహితుడు. అయితే టీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ ఆయనను కేసీఆర్ బయటకు పంపడానికి చేయాల్సినదంతా చేశారు. ఈటల కూడా తాడో పేడో తేల్చుకుదామని రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ దూకుడుగా కేసుల మీద కేసులు పెడుతూండటంతో రక్షణ కోసమో.. మరో కారణమో కానీ ఆయన బీజేపీలో చేరి రాజకీయ పోరాటం ప్రారంభించారు. అంతే కానీ హుజురాబాద్‌లో బీజేపీకి బలం ఉందని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అనుకోరు కూడా., 


Also Read : ఈటల రాజేందర్ ఆధిక్యం వెనుక ఎవరి ‘హస్తం’ ఉంది..? కౌంటింగ్ సరళి చెబుతోంది అదేనా ?


హుజురాబాద్‌లో ఈటల అంటే బీజేపీ.. బీజేపీ అంటే ఈటల !


హుజురాబాద్‌లో బీజేపీకి ఎప్పుడూ కనీస క్యాడర్ లేదు. ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకున్న చరిత్ర కూడా లేదు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీకి వచ్చింది 1683 ఓట్లు. అదే సమయంలో నోటాకు వచ్చిన ఓట్లు 280పైచిలుకు. అక్కడ అరకొరగా ఉన్న బీజేపీ నేతలు ఈటల రాజేందర్ పార్టీలో చేరిన తరవాత సైడైపోయారు. చాలా మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక అక్కడ బీజేపీకంటూ మిగిలింది ఈటల రాజేందర్.. ఆయన అనుచరులు మాత్రమే. అంటే హుజురాబాద్ వరకు ఈటల అంటే బీజేపీ.. బీజేపీ అంటే ఈటల. అందుకే హుజురాబాద్‌లో ఫలితం ఎలా ఉన్నా.. అది ఈటల క్రెడిట్ మాత్రమేనని అంటున్నారు. 


Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?


పోటీ పార్టీల మధ్య కాదని కేసీఆర్‌తోనేనని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఈటల ! 


బీజేపీ అభ్యర్థిని అని ఈటల రాజేందర్ ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన కూడా పోటీ పార్టీల మధ్య కాకుండా తనకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నట్లుగానే ఉండాలని అనుకున్నారు. అందుకే గుర్తును మాత్రం ప్రచారం చేశారు కానీ ఎక్కడా పార్టీ ప్రస్తావన తీసుకు రాలేదు. టీఆర్ఎస్ నేతలు బీజేపీని హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఈటల వ్యూహాత్మకంగా ఈ ఎన్నిక బీజేపీకి సంబంధించినది కాదని ఓటర్ల మనసుల్లో నాట గలిగారు. నిజంగా ఇది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనిసాగి ఉంటే సామాన్యుల ఓట్లు ఈటలకు దూరమయ్యేవి. పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రజల్లో  తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 


Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు


బీజేపీకి క్రెడిట్ దక్కడం కష్టమే.. అంతా ఈటలకే ఇమేజ్ ! 


ఈటల గెలుపుతో బీజేపీ పుంజుకున్నట్లుగా చెప్పుకోలేం కానీ ఈటల ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగిపోతుంది. ఉద్యమనాయకుడిగా ఆయన ఉన్న గుర్తింపు మరింత బలపడుతుంది. ఇది భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారుతుంది. బీజేపీ తరపున బరిలో నిలిచినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ అనుకూల.. వ్యతిరేక వర్గాలుగా పోటీ ఉంటుందని.. ఆ సమయానికల్లా అంతా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ వైపు ఉంటారని నమ్ముతున్నారు. అదే జరిగితే ఈ గెలుపు వల్ల బీజేపీకి మిగిలేదేమీ ఉండదు. తెలంగాణలో పార్టీ టిక్కెట్లు రాని కొంతమంది బీఎస్పీ లాంటి పార్టీల భీఫామ్స్ తెచ్చుకుని పోటీ చేసి గెలుస్తూంటారు. అంత మాత్రాన బీఎస్పీకి బలమున్నట్లుగా కాదుగా... హుజురాబాద్ కూడా అలాంటిదేననేది ఎక్కువ మంది మాట ! 


Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి