KCR Plan :  జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఎప్పుడూ లేనంత హడావుడి కనిపిస్తోంది.  ఇండియా పేరుతో కొత్త కూటమి ఆవిర్భవించింది. ఎన్డీఏను మరింత  విస్తరించారు ప్రధాని మోదీ. వచ్చే ఎన్నికల్లో  ఎన్డీఏ వర్సెస్ ఇండియా అన్నట్లుగా సాగుతుందన్న ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే ఈ సీన్‌లో మిస్సయింది మాత్రం సీఎం కేసీఆర్. ఆయన జాతీయ పార్టీ పెట్టి ఎంత హడావుడి చేసినా హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయం ప్రారంభించినా కార్యకలాపాలు చేపట్టడం లేదు. దీనికి కారణం ముందుగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను టాస్క్ గా పెట్టుకోవడమేననని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


ముందు తెలంగాణలో గెలిచి చూపించాలి ! 


జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బలపడాలంటే ముందుగా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటేనే దేశ రాజకీయాలలో ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ముందుగా ఇంట గెలవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు బలంగా నిలబడాలని ఆయన కోరుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న భావనతోనే కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ పార్టీని గెలిపించాలన్న ఆయన భావన   అర్థమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మళ్లీ కట్టబెడితేనే దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. 


తెలంగాణలో ఓడిపోతే రాజకీయంగా పట్టించుకునేవారే ఉండరు ! 
 
ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది.  సొంత రాష్ట్రాల్లో ఓడిపోయి వారు సాధించిందేమీ లేదు.  కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ నుంచి గెలిచి సీఎం అయ్యారు కాబట్టి ప్రాధాన్యం లభిస్తోంది. మూడో సారి కూడా ముఖ్యమంత్రి అయితే తిరుగు ఉండదు. దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ వస్తుంది. కానీ అధికారం కోల్పోతే మాత్రం మాజీ సీఎంలలో ఆయన ఒకరిగా మిగిలిపోతారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆరు నెలల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధంచడానికి అడ్వాంటేజ్ లభిస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించాల్సిన సమయమని  అందుకే ఇప్పుడు పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించారని అంటున్నారు. 


తెలంగాణపై దృష్టి తగ్గించారన్న భావన ప్రజలకు వస్తే ఇబ్బందే !
 
కేసీఆర్ అంటే.. తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అనే  భావన  ఉంది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను పట్టించుకోకుండా..  దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారంటే.. ఇక్కడ బీఆర్ఎస్‌కు ఓటేయాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయం వినిపిస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే అన్ని విధాలుగా ఆలోచించి.. జాతీయ రాజకీయాల్లో.. బీఆర్ఎస్, కేసీఆర్ పేరు వీలైనంత తక్కువగా వచ్చేలా చూసుకుంటున్నారని అంటున్నారు. మూడో సారి గెలిస్తే దేశవ్యాప్తంగా వచ్చే క్రేజ్ అనూహ్యంగా ఉంటుందని .. కేసీఆర్‌కు తెలుసని అంటున్నారు. అప్పుడు పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని అనుకుంటున్నారు.